సజ్జలా!టైమ్,డేట్,ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే: ఛాలెంజ్‌కి సిద్ధమన్న వర్ల రామయ్య

స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాను నిరూపిస్తానని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు.

Update: 2023-10-12 10:41 GMT
సజ్జలా!టైమ్,డేట్,ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే: ఛాలెంజ్‌కి సిద్ధమన్న వర్ల రామయ్య
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాను నిరూపిస్తానని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎవరైనా నిరూపించగలరా?అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడారు. బహిరంగ చర్చ ఎప్పుడు పెడతారో సజ్జల వెంటనే ప్రకటించాలి అని కోరారు. ‘చంద్రబాబను ఎత్తేసిన సంగతి నాకు తెలియదు, నేను లండన్ లో ఉన్నా’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. ఆరోజు లండన్ నుండి డీఐజీ రఘురామిరెడ్డి, సీఐడీ ఛీఫ్ సంజయ్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మాట్లాడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈరకంగా చంద్రబాబును అరెస్టు చేస్తే.. జగన్ రూ.43 వేల కోట్ల దోపిడీని వైఎస్ సహకరించినందుకు ఆయనకు ఎంతకాలం శిక్ష పడాలి? అని ప్రశ్నించారు. 17ఏ సెక్షన్ ప్రకారం చంద్రబాబుపై కేసే ఉండదంటే.. ఇంక కేసును నిరూపించాల్సిన అవసరమేముంది? అని నిలదీశారు. చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నారు అని మండిపడ్డారు. 11 ఏళ్ల నుండి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు నుండి తప్పించుకు తిరుగుతున్న జగన్.. కోర్టు విచారణ చేస్తే తన శేష జీవితమంతా జైల్లోనే గడపాల్సి వస్తుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.

ఇద్దరమే వస్తాం..మీరు సిద్ధమా?

అవినీతి రహితుడైన చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేశారు అని వర్ల రామయ్య ఆరోపించారు. వైసీపీ నాయకుడి అవినీతి ఎప్పుడో బట్టబయలైందని చెప్పుకొచ్చారు. ‘మీ నాయకుడు మా నాయకుడిపై కక్ష పూరితంగా తప్పుడు కేసులు పెట్టారు. సజ్జల విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. టైమ్, డేట్, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, లేదంటే మీ ఆఫీసులోనైనా సరే నేను సిద్ధం అని వర్ల రామయ్య సూచించారు. చర్చకు తనతోపాటు పట్టాభి వస్తారు, మీరు ఎంతమందినైనా తెచ్చుకోండి. మాకెలాంటి అభ్యంతరం లేదు. అంబటి రాంబాబును తెస్తారా? తెచ్చుకోండి, లేక రోజా ను తెస్తారా తెచ్చుకోండి. ఇంకా ఎవరినైనా తెచ్చుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చారు. న్యాయ నిర్ణేతలుగా సీనియర్ పాత్రికేయులు, నిష్ణాతులైన అడ్వకేట్‌లను పెడదాం. బార్ అసోసియేషన్‌ను కలిసి ఇద్దరు సీనియర్ న్యాయవాదులను ఇమ్మని కోరుదాం అని ఛాలెంజ్ చేశారు. నా సవాల్ విని సజ్జల పారిపోయి ఉంటాడు’ అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

వ్యవస్థలను మేనేజ్ చేసేది జగనే

లండన్ నుండి రఘురామిరెడ్డి, సంజయ్, సజ్జలలను వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడిన విషయం అందరికీ తెలుసునని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. తాను అమాయకుడిని అనడం దెయ్యాలు వేదాలు వల్చించినట్లుంది అని మండిపడ్డారు. లండన్‌లో ఉన్నాను...నాకు తెలియదని జగన్ ఆత్మసాక్షిగా చెప్పగలరా? అని ఛాలెంజ్ చేశారు. సీఐడీ ఛీఫ్ సంజయ్ జగన్మోహన్ రెడ్డికి బాంఛన్ దొర.. నీ కాల్మొక్తా అనేలా ప్రవర్తిస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై జగన్ పబ్లిక్ మీటింగ్‌లో ఎగతాళిగా మాట్లాడటం తగునా? అని నిలదీశారు. జగన్ ప్రభుత్వ కక్షలు, కార్పణ్యాలకు అంతే లేదా? జగన్ గురివింద గింజ సామెతను మరచిపోయి పతీవ్రతలా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ల నుండి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు నుండి తప్పించుకు తిరుగుతున్న మాట వాస్తవంకాదా? చంద్రబాబును అరెస్టు చేసిన విధానం కరెక్టు కాదని ప్రపంచమంతా కోడై కూస్తోంది అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ స్కిల్ కేసును తెరపైకి తెచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను వదలం, ప్రస్తుతం చంద్రబాబు ను ఉంచిన బ్యారెక్ లోనే జగన్ ను పెడతామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.

Tags:    

Similar News