ప్రార్థనలు చేస్తే బ్రెయిన్ ట్యూమర్ తగ్గుతుందనేకుంటే చిన్నారిని బలి
తల్లిదండ్రుల మూఢనమ్మకం (superstition) ఓవైపు.. కటిక పేదరికం మరోవైపు.. వెరసి ఎనిమిదేళ్ల చిన్నారి నూరేళ్ల జీవితాన్ని వదులుకుంది.
దిశ, వెబ్‌డెస్క్ : తల్లిదండ్రుల మూఢనమ్మకం (superstition) ఓవైపు.. కటిక పేదరికం మరోవైపు.. వెరసి ఎనిమిదేళ్ల చిన్నారి నూరేళ్ల జీవితాన్ని వదులుకుంది. ఆపరేషన్ చేస్తేనే బతుకుతుందని చెప్పినా తమ మూఢనమ్మకంతో చర్చిలో(Church) ప్రార్థనలు చేస్తే వ్యాధి నయం అవుతుందని కొందరి మాటలు నమ్మిన తల్లిదండ్రులు చిన్నారిని తమ చేతులారా చంపేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరుకు (Nellore) చెందిన లక్ష్మయ్య, లక్ష్మీ దంపతులకు కూతురు భవ్యశ్రీ(8) ఉంది. ఆమె గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో (Brain tumor) బాధపడుతుంది. తల్లిదండ్రులు చిన్నారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అయినా బ్రెయిన్ ట్యూమర్ తగ్గకపోవడంతో డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పారు. అప్పటికే పేదరికంలో ఉన్న దంపతులు అప్పులు చేసి మరీ చికిత్స అందించారు. మళ్లీ సర్జరీ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుండటంతో ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు దేవుడిపై భారం వేశారు. ఈ క్రమంలోనే కొంతమంది చర్చిలో ప్రార్థనలు చేస్తే జబ్బు తగ్గుతుందని చెప్పడంతో చిన్నారిని చర్చికి తీసుకెళ్లారు. 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేశారు. అయినా బ్రెయిన్ ట్యూమర్ తగ్గకపోగా.. ఈ రోజు చిన్నారి భవ్యశ్రీ ప్రాణాలు విడిచింది. సరైన వైద్యం అందించకుండా మూఢనమ్మకంతో ప్రార్థనలు చేయించి తమ చిన్నారిని కోల్పొయారు. చర్చిలోనే ప్రాణాలు కోల్పోయిన పసిబిడ్డను చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. చిన్నారిని చూసిన స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. తమ మూఢ నమ్మకంతో వైద్యం అందించకుండా తన బిడ్డను తల్లిదండ్రులే దూరం చేసుకున్నారని స్థానికులు వాపోయారు.