Bapatla: తప్పులు.. రిపీట్.. ఆ మూడు సెగ్మెంట్లలో వైసీపీకి మూడినట్టేనా..?
దిశ, దక్షిణ కోస్తా: గత ఎన్నికల్లో చేసిన పొరబాటునకు ఆ మూడు నియోజకవర్గాలను వైసీపీ కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి అసంబద్ధ నిర్ణయాలను తీసుకుందా ? ఈసారి చీరాలలో పట్టున్న ఆమంచి వర్గం, ఎమ్మెల్యే కరణం బలరాంకు సహకరిస్తుందన్న గ్యారెంటీ లేదు. పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఢీ కొట్టే శక్తి ఇన్‌చార్జి ఆమంచికి లేదు. ఆయన బలం, బలగమంతా చీరాల్లోనే ఉంది. నిన్నమొన్నటిదాకా ఇన్‌చార్జిగా కొనసాగిన రావి రామనాధంబాబు ఆమంచికి సహకరిస్తారన్న నమ్మకం లేదు. అద్దంకిలో ఇన్‌చార్జి కృష్ణ చైతన్య నాయకత్వాన్ని అక్కడ ఓ వర్గం తీవ్రంగా విభేదిస్తోంది. ఇప్పటికీ సర్దుబాటు చేసిన దాఖలాల్లేవు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ధీటుగా ఎదుర్కొనే సత్తా కృష్ణ చైతన్యకు లేదు. నాడు వైఎస్జగన్గాలి వీచినప్పుడే ఈ నియోజకవర్గాల్లో ఓటమిని చవిచూడాల్సివచ్చింది. ప్రస్తుతం చేపట్టిన మార్పులతో మళ్లీ టీడీపీ గెలిచే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సీఎం జగన్‌కు నివేదికలు
సీఎం జగన్‌కు క్షేత్ర స్థాయి నివేదికలు ఎలా చేరుతున్నాయో తెలీదు. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చీరాలలో బలరాం, ఆమంచి మధ్య రగడకు ఫుల్స్టాప్పెట్టేందుకు పర్చూరు ఇన్‌చార్జి రావి రామనాధంబాబుకు ఎసరు పెట్టారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేయడంలో ప్రథమ స్థానంలో నిలిచిన రామనాధం బాబును తొలగించారు. ఆయనకు ఇది రెండోసారి పరాభవం. గత ఎన్నికల ముందు ఇలాగే ఇన్‌చార్జిగా సేవలందించాక దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టిక్కెట్ఇచ్చారు. మళ్లీ ఇన్‌చార్జిగా ఇచ్చి ఏలూరికి పోటీ ఇచ్చే స్థాయి లేదంటూ ఇంటికి పంపారు. ఆమంచి కృష్ణమోహన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది.
ఆ సామిజిక వర్గం మద్దతు కష్టమేనా..?
పర్చూరు ఇన్‌చార్జిగా ఆమంచికి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి మద్దతు లభించడం కష్టం. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఈదఫా జనసేన జెండా ఎత్తుకున్నారు. ఒకవేళ టీడీపీతో జనసేనకు పొత్తు కుదిరితే ఇక్కడ వైసీపీ పరిస్థితి మరింత దయనీయమవుతుంది. ఆమంచి పర్చూరు ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడప్పుడూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పునాదులన్నీ చీరాల్లోనే ఉన్నాయి. పూర్వ ఇన్‌చార్జి రామనాధం బాబు కూడా సహకరించే పరిస్థితి లేదు. పర్చూరులో ఆమంచిని పోటీకి దించితే టీడీపీకి మళ్లీ తిరుగులేని విజయం సొంతమవుతుందని కొద్దోగొప్పో రాజకీయ అవగాహన ఉన్నవాళ్లకు ఇది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
బలరాంకు ఆమంచి సహకరిస్తేనే..
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు వెంకటేష్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆమంచిపై వ్యతిరేకత వల్లే టీడీపీ గెలిచింది. ఇప్పుడు బలరాంకు ఆమంచి సహకరిస్తేనే పోటీ ఇవ్వగలరు. ఈపాటికే చీరాల సీటుపై జనసేన ద్వారా ఆమంచి స్వాములు కర్చిఫ్వేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు కుదిరినా లేకున్నా ఆమంచి కృష్ణమోహన్వర్గమంతా స్వాములు వైపు వెళ్తుందే తప్ప బలరాం వైపు రాదు. అప్పటికి కృష్ణమోహనే జనసేన అభ్యర్థి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసినా ఈ రెండు నియోజకవర్గాలు గందరగోళమవుతున్నాయి. తప్పోఒప్పో ఆమంచిని చీరాలలోనే కొనసాగించి బలరాంను పర్చూరు పంపితే కొంతలో కొంత నష్ట నివారణ జరుగుతుందని ఈ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
అద్దంకిలో మళ్లీ ఆయనే..?
ఇక అద్దంకిలో ఇప్పటికి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గొట్టిపాటి రవికుమార్‌ను ఎదుర్కొనే సత్తా బాచిన కృష్ణ చైతన్యకు లేదని అక్కడ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పార్టీలో తలెత్తిన విభేదాలను సర్దుబాటు చేసే యంత్రాంగం లేదు. ఇక్కడ కృష్ణ చైతన్యను కొనసాగిస్తారా లేక మరెవరినైనా బరిలో దించుతారా అనే స్పష్టత లేదు. ఎన్నికల దాకా రెండు ముఠాలుగా పార్టీ కొనసాగినా నష్టమే. ఇక్కడ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని పరిష్కరించేందుకు ఏం చేస్తారనేది మిలియన్‌డాలర్ల ప్రశ్న. టీటీడీ చైర్మన్వైవీ సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం ఇది. మళ్లీ ఇక్కడ ఓటమిని చవిచూస్తే పార్టీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఈ మూడు నియోజకవర్గాలను గెలిచే విధంగా తగు నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.