Janasena: పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్

హెలికాప్టర్‌లో తప్ప రోడ్డు మీద తిరగలేని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు....

Update: 2023-05-14 13:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో‌: హెలికాప్టర్‌లో తప్ప రోడ్డు మీద తిరగలేని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులను మళ్లించి దివాళా తీయించిందని ఆరోపించారు. సొంత డబ్బు ఖర్చు చేసిన అధికార పార్టీ సర్పంచ్ ధనలక్ష్మి ఆర్థిక ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకుందంటే ఇదా మీ పరిపాలనా? అని ప్రశ్నించారు. ఒంగోలులో ఆదివారం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టపోతే ప్రతి గింజా కొంటామన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఇప్పటి వరకు నిర్మించలేని ప్రభుత్వం ప్రకాశం జిల్లాను అంధకారంలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. కోస్తా జిల్లాల ఇన్‌చార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటూ ఇప్పుడు మళ్లీ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అవకాశవాద, స్వార్ధ రాజకీయాలకు దూరంగా ఉంటుందని తెలిపారు అధికారంలోకి రాక ముందు ఒకలా వచ్చాక మరోలా భాష మార్చి మాట్లాడదని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

రైతులకు అండగా నిలబడిన నాయకుడు పవన్ కల్యాణ్

భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజలకు అండగా నిలబడే విధంగా జనసేన పార్టీ కార్యచరణ ఉంటుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా నుంచి పెద్ద పెద్ద నాయకులు అధికార పార్టీలో ఉన్నా సొంత జిల్లాలో సౌకర్యాల గురించి పట్టించుకోరని చెప్పారు. ‘వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి 20 ఏళ్లు పూర్తవుతోంది. దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో వై.వీ సుబ్బారెడ్డి చెప్పగలరా? కోస్తా మొత్తం తిరుగుతారు. సొంత జిల్లాలో రైతులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి పట్టించుకోరు.’ అని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. వర్తమాన రాజకీయాల్లో రైతులకి అండగా నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు.

‘ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 73 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించారు. అలాంటి నాయకుడి మీద విమర్శలు చేయడం, టీవీ డిబేట్లలో మాట్లాడడం మినహా మంత్రులు ఏం చేస్తున్నారు. చిత్తశుద్ధి నిజాయితీ ఎవరికి ఉన్నాయో ప్రజలు అర్ధం చేసుకోవాలి. ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి విమర్శిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి రైతుల్ని ఆదుకునేందుకు తన జేబు నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేశారా?. కక్షపూరిత చర్యలతో ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందిపెడుతోంది. సంక్షేమ పథకాల అమలులో లబ్దిదారుల్ని సమానంగా చూసే పరిస్థితులు లేవు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సాయంతో కొంత మందికే పరిమితం అవుతున్నారు.’ అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తులు

జనసేన పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా సమస్యలపై బలంగా వాణి వినిపించే విధంగా ముందుకు వెళ్తుందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక మంచి ప్రణాళికతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటం సభలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనే గొప్ప నిర్ణయం ప్రకటించారని తెలిపారు. ఈ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గాలు, దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని అంతా కలసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారన్నారు. రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పారదర్శకంగా, ప్రజల ముందు చర్చించి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు చంద్రబాబు నాయుడుతో చర్చించారు. సీట్లు ఓట్ల గురించి కాకుండా కేవలం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఆ చర్చలు సాగాయి. పొత్తుల విషయంలో అంతా పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాం.’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Read more:

జనసైనికులను ఘోరంగా అవమానించిన మంత్రి అమర్‌నాథ్ 

Tags:    

Similar News