పులినే తినేశారు?.. ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన
అటవీ ప్రాంతాల్లో జంతువులు సంచరిస్తూ ఉండటం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తమ పంట పొలాల సంరక్షణతోపాటు తమ రక్షణ కోసం చాలా మంది విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకుంటారు...
- విద్యుత్ కంచెకు తగిలి పులి మృతి
- పులిగోర్ల విషయంలో విభేదాలు రావడంతో బట్టబయలు
- విచారణ చేపట్టిన ఫారెస్ట్ రేంజ్ అధికారి
దిశ, డైనమిక్ బ్యూరో: అటవీ ప్రాంతాల్లో జంతువులు సంచరిస్తూ ఉండటం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తమ పంట పొలాల సంరక్షణతోపాటు తమ రక్షణ కోసం చాలా మంది విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకుంటారు. ఇది అనేక ప్రాంతాల్లో తరచూ గమనిస్తూనే ఉన్నాం. అయితే ఆ విద్యుత్ కంచెకు అనేక జంతువులు బలైన దాఖలాలు లేకపోలేదు. అయితే తాజాగా ఇలా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు పులి తగిలి మరణించిందని తెలుస్తోంది. మిగిలిన జంతువుల మాదిరిగానే చనిపోయిన పులిని సైతం కూర వండుకుని తినేశారని తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాదముద్రలను గుర్తించారు. అడవిలో రెండు మగ పులులు, ఒక ఆడపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. వాటి జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి ఆ ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేశారు. ఆరు బయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరిస్తూ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి మరణించింది. అది గమనించిన 12 మంది పులి మాంసాన్ని వండుకుని తినేశారని ప్రచారం జరుగుతుంది. అయితే పులిగోర్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో వారిలోని ఓ వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పులి మాంసాన్ని వండకున్న వారంతా దాని చర్మాన్ని ఓ బావిలో పడేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదంతా అవాస్తవం : ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి
అయితే పులి మాంసాన్ని వండుకుని తిన్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ప్రచారంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అక్కపాలెం గ్రామంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. పులిని చంపిన దాఖలాలు కూడా ఇప్పటి వరకు గుర్తించలేనట్లు వెల్లడించారు. ఈ ఆరోపణలపై ఇంకా విచారణ కొనసాగుతుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.