పవన్ కల్యాణ్ విదేశీటూర్ : వారాహి విజయయాత్రకు బిగ్ బ్రేక్.. ఎందుకంటే!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రకు బిగ్ బ్రేక్ ఇవ్వనున్నారా?
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రకు బిగ్ బ్రేకింగ్ ఇవ్వనున్నారా? తెలుగు రాష్ట్రాలనే కాదు ఏకంగా ఈ దేశాన్నే విడిచివెళ్తున్నారా? సినిమా షూటింగ్ కోసమా? పార్టీ ఎన్ఆర్ఐలతో సమావేశం కోసమా? అసలు పదిరోజులపాటు పవన్ కల్యాణ్ దేశం దాటి వెళ్లడం వెనుక కారణం ఏమిటి? అంటే ఒకే ఒక సమాధానం పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో గడపటం కూడా చాలా అరుదుగా కనిపిస్తోంది. అయితే త్వరలోనే మెగా కుటుంబంలో ఓ పెళ్లి వేడుక జరగనుంది. మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్....హీరోయిన్ లావణ్యత్రిపాఠి వివాహ వేడుక జరగనుంది. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒక్కటికానున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకుంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత సమావేశాలు వరుసగా నిర్వహించి అన్ని చక్కదిద్దిన తర్వాత ఇటలీ వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 5 నుంచి వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రేక్ అనేది మూడు వారాలపాటు ఉంటుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
బెయిలొస్తే చంద్రబాబుతో భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 1న ప్రారంభించిన నాలుగో విడత వారాహి విజయయాత్రకు లాంగ్ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే సమన్వయ కమిటీని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో ఎలా సమన్వయం చేసుకోవాలో పవన్ కల్యాణ్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అలాగే ఉమ్మడి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు జనసేన పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం 12 నుండి 17 వరకు పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంటే వారానికి పైగా పవన్ కల్యాన్ పార్టీ కార్యక్రమల్లో బిజీబిజీగా గడపనున్నారు. ఈలోగా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయితే పవన్ కల్యాణ్ భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇరు పార్టీల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ..ఉమ్మడి కార్యచరణ వంటి అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇది కూడా చంద్రబాబుకు 17లోపు బెయిల్ వస్తేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణ నేతలతోనూ భేటీ
తెలంగాణ నేతలతోనూ పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఏపీకంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను సైతం ఒక దశలో ఖరారు చేశారు. అంతేకాదు అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటించేసి ప్రచారానికి తెరలేపారు. అయితే తెలంగాణలో 32 స్థానాల్లో పోటీచేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపుపై చర్చించనున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉందా? టీడీపీతో కూడా కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో జైల్లో పెట్టడంతో ఆంధ్రప్రదేశ్‌లోనేకాదు తెలంగాణ రాష్ట్రంలోనూ సానుభూతి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీతో కలిసి వెళ్తే అది ఫలిస్తుందనే పలువురు పవన్ కల్యాణ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో వర్కౌట్ అయినట్లు తెలంగాణలో అది వర్కౌట్ అవుతుందా అని పవన్ కల్యాణ్ అడిగినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ సైతం తెలంగాణలో పవన్ కల్యాణ్ పొత్తుకోసం వేచి చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు బెయిల్‌పై బయటకు వస్తే తెలంగాణలోని పొత్తుపైనా ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కుటుంబంతో కలిసి ఇటలీకి
ఈనెల 17 వరకు పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన అనంతరం వ్యక్తిగత కారణాలతో ఇటలీ వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగబోతుంది. త్వరలో వీరి పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తేదీ అనేది ఇంకా మెగా ఫ్యామిలీ బయట పెట్టలేదు. ముహూర్తం విషయంలో సర్‌ప్రైజ్ మెగా ఫ్యామిలీ అంటున్న సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకుంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వారితో పాటు వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అక్టోబర్ 17న పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుక ముగిసిన తర్వాత ఈనెల 26న పవన్ కల్యాణ్ తిరిగి స్వదేశానికి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ అనంతరం డెహ్రాడూన్, హైదరాబాద్‌లలో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలలో సైతం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. లావణ్యత్రిపాఠి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పుట్టినప్పటికీ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో పెరిగారు. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్‌లో కూడా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. మెుత్తానికి పవన్ కల్యాణ్ నవంబర్ నుంచి మళ్లీ వారాహి విజయయాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. అప్పటి వరకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.