Oath Taking: ప్రజా పాలనకు పట్టాభిషేకం.. నేడే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లలో విజయదుదుంభి మోగించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లలో విజయదుదుంభి మోగించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో 5 సంవత్సరాల 5 రోజుల వైసీపీ పాలనకు తెర పడింది. ఈ క్రమంలో ఇవాళ గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కార్యక్రమానికి ప్రధాన నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు మోహన్, ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నేత తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, సీనీ ప్రముఖులు చిరంజీవి, రజినీకాంత్ హాజరుకానున్నారు. అదేవిధంగా ఎన్డీఏ మిత్ర పక్షాలు రాష్ట్రంలోని కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కేసరపల్లిలోని 11.18 ఎకరాల్లో ప్రమాణ స్వీకార సభా ప్రాంగాణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అతిథులందరికీ వేదిక కనిపించేలా 36 గ్యాలరీల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పా్టు చేశారు. అదేవిధంగా వీవీఐపీల కోసం ప్రత్యేకంగా మూడు గ్యాలరీలను సిద్ధం చేశారు. ముఖ్యంగా ప్రధాని రాకతో పోలీసు డిపార్ట్‌మెంట్ సుమారు 10 వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇక వాహనాల పార్కింగ్ కోసం 56 ఎకరాల్లో ఐదు చోట్ల ఖాళీ ప్రదేశాలను అదుబాటులో ఉంచారు. ప్రమాణ స్వీకర వేదికపై 36 మంది కూర్చునే అవకాశం ఉంది.