మింగటంలోనే కాదు, మేత మేయటంలోనూ వైసీపీ దిట్ట: అచ్చెన్నాయుడువ
ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే రాబందుల్లా ప్రజలను పీక్కుతినటం మన రాష్ట్రంలోనే జరుగుతుంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే రాబందుల్లా ప్రజలను పీక్కుతినటం మన రాష్ట్రంలోనే జరుగుతుంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.. ఎమ్మెల్యేలు తమ విధులను మరిచిపోయారు. రాష్ట్రంలోని భూములను గద్దల్లా ఎగరేసుకుపోతున్నారు.‘లంచం అడగటం నేరం కానీ ఎమ్మెల్యేలు అడిగితే ధర్మం’ఇదే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అని మండిపడ్డారు. నేడు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద జరిగిన ఘటనే దీనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. తమ గోడును సీఎంకు మొరపెట్టుకునేందుకు రాష్ట్ర ప్రజలకు హక్కు లేదు. భూ వివాద పరిష్కారానికై నరసరావుపేటకు చెందిన కుటుంబం స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని కలువగా అతను రూ.16 లక్షలు అడగటం చూస్తుంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఎమ్మెల్యే వేధింపులకు తట్టుకోలేక సీఎంకు చెప్పుకునేందుకు వచ్చిన తమకు న్యాయం జరగదని ఆందోళన చెందిన ఆ కుటుంబం చేసేదేమిలేక ఆత్మహత్యకు యత్నించడం తీవ్రంగా కలిచివేసింది. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేగా అనర్హుడు అని చెప్పుకొచ్చారు. కాబట్టి వెంటనే అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేసి వేధింపుల నుండి ఆ కుటుంబాన్ని రక్షించి రాజ్యాంగాన్ని కాపాడాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేస్తున్నాం.