సీఎం జగన్, సజ్జల ఆదేశాలతోనే నా ఫోన్ ట్యాపింగ్: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన మోశాను.
దిశ, డైనమిక్ బ్యూరో : 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన మోశాను. పార్టీకి ఉన్నంతలో ఎంతో సేవ చేశాను. అలాంటి నాపైనే కుట్రలు చేశారు. నా ఫోన్ టాపింగ్ చేశారు' అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. అన్నా వైఎస్ జగనన్నా మీ ఫోన్ ట్యాప్ అయితే ఎలా ఉంటుంది.. భరించగలరా అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిల ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు లభిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ విభాగం తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఇన్నాళ్లలో తాను వైసీపీని కానీ.. వైఎస్ జగన్‌ను కానీ విమర్శించలేదని వివరణ ఇచ్చారు.
అయినప్పటికీ తనపై చర్యలకు ఉపక్రమించడం బాధించిందన్నారు. పార్టీకి ఇంత సేవ చేసిన తనఫోన్ ట్యాపింగ్ చేస్తే మనసుకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయదలచుకోవడం లేదన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు మనసు అంగీకరించడం లేదన్నారు. మనసు ఒకచోట శరీరం మరోకచోట ఉండటం తనకు ఇష్టం లేదని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్ఆర్‌కు తాను వీరవిధేయుడినని, వైఎస్ జగన్ అంటే వీరాభిమానం అని అందువల్లే ఇన్నాళ్లు ఎన్ని అవమానాలు ఎదురైనా భరించానని కానీ తన సంజాయిషీ అడగకుండా చర్యలకు దిగడం తట్టుకోలేకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలనుకోవడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.
సీఎం జగన్, సజ్జల చెప్తేనే ట్యాపింగ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడినైన తనను ఇబ్బంది పెట్టారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్..సజ్జల..విజయ్ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. ఈ ట్యాపింగ్ అంశంపై సీఎం వైఎస్ జగన్ ఆలోచించాలని సూచించారు. తాను ఐఫోన్ వాడుతున్నానని.. తన మిత్రుడు లంకా రామ శివారెడ్డి సైతం అదే ఫోన్ వాడుతున్నాడని ఇద్దరం మాట్లాడుతున్న అంశాలు రికార్డ్ అయ్యాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు తనకు ఫోన్ చేసి..నాఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పారని ఆడియో సైతం పంపారని చెప్పుకొచ్చారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే ట్యాపింగ్ జరిగిందని చెప్పానన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు అని ఆరోపించారు.
నేను మహా నాయకుడిని అని చెప్పడం లేదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న నాపై నిఘా పెట్టారు అని చెప్పుకొచ్చారు. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఒక పోలీస్ అధికారి చెప్పారు..దేనిని నేను నమ్మలేదు. కలలో కూడా ట్యాప్ చేస్తారని అనుకోలేదు. 20 రోజులముందు ట్యాపింగ్‌కు సంబంధించి అధారాలు లభించాయి. సీఎం జగన్ లేదా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి ఉంటేనే ట్యాప్ చేశారు. లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం అంత సులభం కాదు అని చెప్పుకొచ్చారు. మరో ఐపీఎస్ అధికారి సైతం తనకు ట్యాపింగ్‌పై సమాచారం ఇచ్చారని ఆయన పేరు చెప్పనని అన్నారు. ట్యాపింగ్ వ్యవహారం బయట పెడితే ప్రభుత్వానికి..ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బంది అవుతుందని భావించానని అందుకే ఇన్నాళ్లు ఓపికగా ఉన్నట్లు తెలిపారు. ట్యాపింగ్‌పై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం సమాధానం చెప్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలదీశారు.
నాతోపాటు 35మంది ఫోన్ ట్యాపింగ్
రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. వారంతా తనకు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారన్నారు. తాము బయటపడలేని స్థితిలో ఉన్నామని మీరు బయటపడ్డారని చెప్పుకొచ్చారని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. ఒక ఎమ్మెల్యే మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఇక్కడతో ఆగదని చెప్పుకొచ్చారు. ఇంకా అనేకమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్‌పై తనకు ఎవరు సమాధానం చెప్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.
జగన్, వైసీపీలను ఏనాడూ విమర్శించలేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే తాను వైఎస్ జగన్ వెంట నడిచానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు చిత్త శుద్దితో పని చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తింపు కోరుకున్నా అందులో తప్పేముందన్నారు. పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన వారు గుర్తింపు కోరుకోవడ తప్పేం కాదు కదా అని ప్రశ్నించారు. గుర్తింపు ఇవ్వకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ గురించి గానీ వైసీపీపై గానీ ఏనాడూ పరుషంగా మాట్లాడలేదు అని వివరణ ఇచ్చారు. బారా షాహిద్ దర్గాకు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ విడుదల చేయలేదని ఆ పరిణామాలతోనే ఆర్థిక శాఖకార్యదర్శి రావత్ తీరును విమర్శించానని చెప్పుకొచ్చారు.
బయటకు వెళ్తే పరిస్థితి కల్పించారు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విధానంపైనా, తనపైనా చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మాటలుగా భావిస్తున్నట్లు తెలిపారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అభూత కల్పన అంటూ కొట్టిపారేయడాన్ని ఖండించారు. టీడీపీతో ఇప్పటికే ఆయన ఒప్పందం చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అంశంపై మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని బాలినేని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలుగా భావిస్తు్న్నట్లు తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలపై ఎలాంటి వివరణ కోరకుండా చర్యలకు ఉపక్రమించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తాను ఏమి వ్యాఖ్యానించకుండానే ఇన్‌చార్జిని నియమిస్తామని బాలినేని చెప్పారని అంటే తాను వెళ్లకపోయినా వెళ్లే పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ బలోపేతం కోసం ఎంతో శ్రమించానని.. అయినప్పటికీ తనకు ఏమి పదవులు ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు. వందలాది మందికి కేబినెట్ హోదా ఉన్న పదవులు ఇచ్చారు కానీ తాను దేనికి పనికి రానని పార్టీ భావించింది. నన్ను అనుమానుంచిన చోట ఉండకూడదని నిర్ణయించుకున్నా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇకపోతే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీమంత్రి బాలినేని పిలిచారా ..మేమే వెళ్ళామా అనేది త్వరలో చెబుతానని స్పష్టం చేశారు. మరోవైపు తన ఫోన్ ట్యాపింగ్‌కు గురికాలేదని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పడం సరికాదన్నారు. విచారణ చేయమని కోరారు. వ్యవస్థలు అన్నే మీ వద్దే ఉన్నాయి. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అని సూచించారు.
చంద్రబాబు టికెట్ ఇస్తే పోటీ చేస్తా
వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై కార్యకర్తలతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని కార్యకర్తలకు చెప్పానని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌కు తనపై నమ్మకం లేనప్పుడు పార్టీలో ఎలా కొనసాగుతం అని చెప్పుకొచ్చారు. అందుకే మౌనంగా వైసీపీని వీడాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోసారి కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Also Read...