దిశ, ఏపీ బ్యూరో: సినీ నటుడు అలీ కి సీఎం వైఎస్ జగన్ తీపికబురు చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అలీని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీలో టాలీవుడ్ అగ్ర నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు హాస్య నటుడు అలీ ని సైతం సీఎం వైఎస్ జగన్ చర్చలకు ఆహ్వానించారు. ఈ కీలక భేటీకి ఆలీ రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భేటీలో సీఎం వైఎస్ జగన్ అలీతో ప్రత్యేకంగా మాట్లాడారని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో మళ్లీ కలుద్దాం అంటూ సీఎం జగన్... అలీ భుజం తట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు అలీ. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనారిటీ కేటగిరీలో మంత్రిగా అవకాశం కల్పిస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ అవేమీ జరగలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అలీని రాజ్యసభకు పంపాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో అందులో ఒక స్థానాన్ని మైనారిటీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారట. మైనారిటీ కోటాలో అలీని పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.