Minister Gudivada Amarnath : పవన్ కల్యాణ్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు
రాష్ట్రంలో వలంటీర్లను చూస్తే ప్రజలు భయపడటం లేదని.. పవన్ కల్యాణ్‌ను చూస్తేనే భయపడుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వలంటీర్లను చూస్తే ప్రజలు భయపడటం లేదని.. పవన్ కల్యాణ్‌ను చూస్తేనే భయపడుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ విమర్శించారు. వలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో సోమవారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. నిత్యం వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడమే పవన్ పనా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ ఇలానే మాట్లాడితే ప్రజలే చెప్పులు చూపిస్తారని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కాకి లెక్కలను ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని చెప్పుకొచ్చారు. ఎంత ప్రయత్నించినా ప్రజల్లో పార్టీకి గానీ తనకు గానీ ఎలాంటి మైలేజ్ రాకపోవడంతో పవన్ కల్యాణ్ సైకోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఏలూరు సభలో పవన్ హావభావాలు చూస్తుంటే ఉన్మాదిని తలపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని చెప్పుకొచ్చారు. కమెడీయన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎమ్మెల్యేలుగా అయ్యారని కానీ పవర్ స్టార్‌గా పేర్గాంచిన పవన్ కల్యాణ్ మాత్రం ఎందుకు కాలేకపోయారని మంత్రి అమర్నాథ్ నిలదీశారు.
వలంటీర్లపై వ్యాఖ్యలు అభ్యంతరకరం
వలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వలంటీర్లలో 60 శాతం మంది మహిళలే ఉన్నారని అలాంటి వారిని అవమాన పరిచేలా పవన్ కల్యాణ్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్నారని గుర్తు చేశారు. కరోనా సమయంలో వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ కరోనా సమయంలో హైదరాబాద్‌లోని ఫాం హౌస్‌లో నిద్రపోయారని విమర్శించారు. వలంటీర్లు.. ఇంటింటికి వెళ్లి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, వితంతులు ఉన్నారు.. వారి బ్యాగ్రౌండ్ ఏమిటనేది చూస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు ఉన్న ఆలోచనలు వలంటీర్ల మీద రుద్దేస్తే ఎలా?. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు భయపడాలంటే పవన్ కల్యాణ్‌కే భయపడాలి. రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కడతావోనని భయపడి తిరుగుతున్నారు అని విమర్శలు చేశారు. పవన్ తండ్రి వెంకటరావు ఏ సందర్భంలో కల్యాణ్ అని పేరు పెట్టారో గానీ ఆపేరును సార్థకం చేసుకున్నావు. నిత్య పెళ్లికొడుకుగా మారావు అని ఎద్దేవా చేశారు. ఏదైనా ఆపద వస్తే వలంటీర్లు ఆదుకుంటారనే నమ్మకం ప్రజల్లో ఉందని.. అలాంటి వలంటీర్లపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.
పవన్ ఎమ్మెల్యే ఎందుకు కాలేకపోతున్నారు?
మరోవైపు పవన్ కల్యాణ్ తన తల్లిని, భార్యను సీఎం వైఎస్ జగన్ అవమానించారంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కల్యాణ్ కుటుంబం పట్ల సీఎం వైఎస్ జగన్‌కు ఎప్పుడూ గౌరవం ఉందన్నారు. పవన్ కల్యాణ్ తల్లిని, భార్యను వైసీపీ ఎప్పుడూ ఏం అనలేదని చెప్పుకొచ్చారు. టీడీపీని సపోర్టు చేసే యూట్యూబ్ చానల్స్, మీడియా సంస్థలు పవన్ తల్లిని అవమానించారని గుర్తు చేశారు. అలాంటి వాళ్లకే పవన్ కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. సినిమాల్లో ఉన్న కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిసులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు అవ్వడం లేదంటే అందుకు కారణం పవన్‌ను ప్రజలు నమ్మకపోవడమే కారణమని చెప్పుకొచ్చారు.
టీడీపీలో జనసేనను విలీనం చేయండి
జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. టీడీపీ నుంచి ప్యాకేజీ రూపంలో తీసుకున్న డబ్బును ఖర్చు చేయడమెందుకు అని సూచించారు. జనసేనను టీడీపీలో విలీనం చేస్తే సరిపోతుందని సూచించారు. విలీనం చేస్తే విడతల వారీగా డబ్బులు రావని భయపడుతున్నావా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ మాటలను వైసీపీ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన కిరాయి కార్యకర్తలకు, సైకో ఫ్యాన్స్‌కు మాత్రమే రుచిస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు.