కొత్త ఎస్పీకి జిల్లాలో అనేక సవాళ్లు.. కర్నూలులో అదుపుతప్పిన శాంతిభద్రతలు
నగరంలోని వందల మంది ఆటో డ్రైవర్లు దొంగతనాలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వీరి దందాకు నాలుగో సింహం అండదండలు ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
దిశ, కర్నూలు ప్రతినిధి: నగరంలోని వందల మంది ఆటో డ్రైవర్లు దొంగతనాలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వీరి దందాకు నాలుగో సింహం అండదండలు ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిఘా నేత్రాలు పని చేయకపోవడం వీరికి కలిసొచ్చింది. ఆర్టీసీ బస్టాండ్, కంట్రోల్ రూమ్, బళ్లారి చౌరస్తా, సీ క్యాంప్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ ఇలా ప్రధాన ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు పోలీసుల అండ చూసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి.
లక్ష్యం అభాసుపాలు..
కర్నూలు నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తామని, అందుకు ప్రభుత్వం 22 రాత్రి గస్తీ వాహనాలు అందజేసిందని అప్పటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. నగర ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం కల్గించాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టారు. గస్తీ బీట్ పాయింట్లు 102 కు ఉండగా మరో 35 పెంచారు. 7 సెక్టార్లలో 22 చిన్న చిన్న సబ్-రూల్స్ గా విభజించారు. డీఎస్పీ స్థాయి అధికారులు రాత్రి గస్తీని పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నుంచి పోలీసు అధికారులు మానిటరింగ్ చేస్తుంటారని జిల్లా ఎస్పీ చెప్పారు. కానీ కొందరు పోలీసులు.. దొంగలతో చేతులు కలిపి లక్ష్యాలను అభాసుపాలు చేస్తున్నారు.
ఎస్పీ కార్యాలయంలోనూ..
చీటింగ్‌లు, భూ తగాదాలు, కుటుంబ కలహాల వంటి చిన్న చిన్న సమస్యలు కూడా మండల పోలీస్ స్టేషన్లలో పరిష్కరించలేకపోతున్నారు. దీంతో బాధితులు ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో కూడా చాలా మందికి నిరాదరణే ఎదురవుతోంది. ఆ ఫిర్యాదులను తిరిగి మండల పోలీస్ స్టేషన్లకే పంపుతుండడంతో సమస్యలు మొదటికి వస్తున్నాయి. తమను కాదని ఎస్పీ దగ్గరకు వెళ్తుండడంతో సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు ఫిర్యాదుదారులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. గతంలో పలువురు ఎస్పీలు చేపట్టిన మీతో మీ ఎస్పీ, ఫోన్ ఇన్ ఎస్పీ, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలను అటకెక్కించారు.
సామర్థ్యం లేని అధికారులకు పోస్టింగ్‌లు..
జిల్లా పోలీసు శాఖపై రాజకీయ ప్రాబల్యం పూర్తిగా పెరిగిపోయింది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్ లేకపోతే పోస్టింగ్ దక్కని పరిస్థితి. వీరి అండదండ లేని వారు ఏళ్ల తరబడి పోస్టింగ్ లేకుండా అప్రాధాన్య పోస్టుల్లో మగ్గుతున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో వచ్చిన కొందరు సెటిల్ మెంట్లు, పంచాయతీలతో లంచాలు దండుకుంటున్నారు. దీంతో నేర పరిశోధన మందగించింది.
నిర్లక్ష్యపు అధికారులపై వేటు..
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్ అవినీతి అధికారుల భరతం పట్టే పనిలో పడ్డారు. నగర పీఎస్లో 105 కిలోల వెండి మాయం కేసులో సీఐ విక్రమసింహ, ఎస్ఐ లక్ష్మీనారాయణ, ఏఎస్ఐ భాస్కర్ రాజును సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. మరో వైపు ఏడాదిలో ఎన్నికలు ఉండటం, ప్రస్తుతం జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతుండడంతో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. అవినీతి అక్రమాలు, దొంగతనాలు, దాడులు, మట్కా వంటి వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.