Cheetah:ఆ జిల్లాలో మరోసారి చిరుత సంచారం..భయాందోళనలో స్థానికులు
ఇటీవల చిరుత పులులు, ఏనుగులు స్థానిక అటవీ ప్రాంతాల నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దిశ,వెబ్డెస్క్: ఇటీవల చిరుత పులులు, ఏనుగులు స్థానిక అటవీ ప్రాంతాల నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని మహానందిలో చిరుత మరోసారి సంచారం కలకలం రేపింది. తాజాగా మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో గ్రామస్తులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ మహానంది క్షేత్ర పరిసరాల్లో, గ్రామ శివారులో గత రెండు నెలలుగా చిరుత సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని సమాచారం. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు చెబితే గ్రామ శివారులో, గుడి వెనుక భాగాన చెత్త వేయడం వల్ల పందులు, కుక్కలు గుంపులుగా ఉంటున్నాయని వాటి కోసం చిరుత వస్తుందన్నారని గ్రామస్తులు వాపోయారు. ప్రాణహాని జరిగితే గానీ చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోరా? అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.