CM Chandrababu:త్వరలో స్వర్ణాంధ్ర 2047–విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Update: 2024-11-29 12:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్‌ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుంచి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ - 2047ను డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. విజన్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం- మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్.. అనే ప్రధాన సూత్రాలు, లక్ష్యాలను సీఎం ఇది వరకే వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై స్పష్టంగా విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News