తెలంగాణలో ఏపీ వైసీపీ నేత కబ్జా.. హైడ్రా నోటీసులు

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి ‘హైడ్రా’ నోటీసులు జారీ చేసింది.....

Update: 2024-09-28 02:26 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి ‘హైడ్రా’ నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్‌పల్లిలోని నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేశారని హైడ్రా అధికారులు గుర్తించారు. తాజాగా సర్వే చేపట్టి వెంచర్‌లో చేపట్టిన అక్రమణలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఈ వార్త ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైరల్‌గా మారింది. నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. శిల్పా కుటుంబం వ్యాపారంతో పాటు వెంచర్లు వేసి నిర్మాణాలు చేసేది. మంత్రిగా ఉన్న సమయంలో నల్లవాగును కబ్జా చేసి వెంచర్‌లో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం..

ఇటీవల భారీ వర్షాలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. దీంతో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. హైడ్రా పేరుతో ఆక్రమణలు, చెరువులు, కుంటలు, కాల్వలను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమిత కట్టడాలను కూల్చి వేస్తూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.

తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా అధికారులు నోటీసులిచ్చింది. సర్వే చేసిన అధికారులు ఆక్రమిత కట్టడాలను కూల్చివేసినట్లు సమాచారం. అయితే జిల్లాకు చెందిన నేతలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు?, మాజీ మంత్రి పేరు తర్వాత ఎవరికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ జోరందుకుంది. ఈ విషయంపై మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, సోదరుడు, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Similar News