Nandyal: చేతగాని దద్దమ్మలు.. మంత్రులపై రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైనా పొలాలను పరిశీలించాడా అని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు...
దిశ, నంద్యాల ప్రతినిధి: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైనా పొలాలను పరిశీలించాడా అని, రైతులతో కలిసి మాట్లాడాడా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మంత్రికి కరువుపై అవగాహన లేదని ఆయన విమర్శించారు. నంద్యాలలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరవుతో రైతులు అల్లడుతుంటే అధికారులు పట్టించుకోకుండా నిద్రపోతున్నారని విమర్శించారు. శ్రీశైలం జలాశయంలో నీళ్లు లేవని, రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో పంట వేయలేదన్నారు. 440 మండలాల్లో కరవు ఉంటే కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రజలు వలసలు పోతున్నారని, వలసలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కర్ణాటక ప్రభుత్వాన్ని చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ నెలలోనే కరువు జిల్లాలు ప్రకటించి, ఆ మేరకు కేంద్ర బంధాన్ని పర్యటింపజేసుకుందన్నారు. అసలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందా అని, దాన్ని బహిర్గతం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వీటిపై ఈ నెల 20, 21 తేదీల్లో విజయవాడలో 30 గంటల పాటు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక ఎన్నికల సమయంలో అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపడతామని చెప్పి కేంద్రం రూ. 5300 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. అప్పర్ భద్ర కడితే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదన్నారు.
నూజివీడులో సీఎం జగన్ పట్టాలను పంపిణీ చేశారని, అప్పట్లోనే సీపీఐ పార్టీ ఆ భూములను పోరాడి సాధించుకుందని చెప్పారు. గతాన్ని జగన్ తెలుసుకోవాలని రామకృష్ణ హితవు పలికారు. అదీకాక తిరిగి సీపీఐ నాయకులనే హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ఆయన నిలదీశారు.