Mlc Elections: పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా సాగేలా ప్రతి ఒక్కరూ విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని నోడల్, సెక్టోరల్ అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు...
దిశ, కర్నూలు ప్రతినిధి: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా సాగేలా ప్రతి ఒక్కరూ విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని నోడల్, సెక్టోరల్ అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణపై కర్నూలు కలెక్టరేట్ వైయస్సార్ సెంటినరీ హాలులో జాయింట్ కలెక్టర్ టి. నిశాంతితో కలిసి నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. పోలింగ్ అధికారుల శిక్షణా తరగతులకు గైర్హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్ఓను ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి విద్యుత్, టాయిలెట్స్, ఫర్నిచర్, ర్యాంపులు తదితర సౌకర్యాలను పరిశీలించాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలు సిద్ధం చేయాలని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించారు.
షార్టు టెండర్లను పిలిచి పోలింగ్ సామాగ్రిని సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత నోడల్ అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియకు అవసరమయ్యే వాహనాలను సమకూర్చాలని డీటీసీని ఆదేశించారు. స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటర్లలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. గుర్తించిన భద్రతా గదులను పరిశీలించి లోటు పాట్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.