వల్లభనేని వంశీకి దెబ్బ మీద దెబ్బ.. 100 మంది నాయకులు జంప్
గన్నవరంలో 100 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు..
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసి యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు. అయితే వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. అంతేకాదు టీడీపీ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తుండటంతో గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఖరారు అయ్యారు. దీంతో నియోజకరవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. రోజురోజుకు ప్రజాధరణ పెరుగుతోంది. ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చి వెంకట్రావు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే యార్లగడ్డ ఆధ్వర్యంలో టీడీపీ మరింత బలపడుతోంది. ప్రతి నిత్యం ఆయన సమక్షంలో భారీ చేరికలు జరుగుతున్నాయి. వల్లభనేని వంశీ అనుచరులు సైతం యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. తాజాగా 100 మంది నాయకులు, వారి కుటుంబాలు యార్లగడ్డ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఈసారి గన్నవరంలో మళ్లీ టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు వల్లభనేని వంశీకి ఇంకా సీటు ఖరారు కాలేదు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం 7 విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కానీ అందులో వల్లభనేని లేడు. దీంతో ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. తమ నాయకుడిని సీటు ఖరారుకాక.. కొందరు పార్టీ నుంచి జారీ పోతుండటంతో వారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ పరిణామాలతో గన్నవరంలో రాజకీయాలు కాకరేపుతున్నాయి.