Cm Jagan: ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు అధికారం మనదే
2024 ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి. ఎలాంటి విభేదాలు ఉన్నా పక్కన పెట్టాలి. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం...
- 2024 ఎన్నికలను సీరియస్‌గా తీసుకోండి
- ఎలాంటి విభేదాలున్న పక్కన పెట్టాలి
- కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో 80శాతం రిజల్స్ట్ సాధించాం
- విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ హవా ఉంది
- రెండుసార్లు ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలి
- ఖచ్చితంగా 175 కి 175 సీట్లు గెలవాలి
- విజయవాడ తూర్పు నియోజకవర్గం నేతలతో సమీక్షలో సీఎం వైఎస్ జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : '2024 ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి. ఎలాంటి విభేదాలు ఉన్నా పక్కన పెట్టాలి. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్ నొక్కే కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒకరికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి' అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో 14 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కుప్పంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో 85 శాతం విజయం సాధించామని, అలాగే విజయవాడ తూర్పులో కూడా వైసీపీ జెండా ఎగురవేసేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు.
మనకు ఓటు వేయని వాళ్ల ఇంటికి కూడా వెళ్లాలి
'త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. గడపగడపకూ కార్యక్రమం ద్వారా మనం ప్రజల్లో మమేకం అవుతున్నాం. ఎక్కడైనా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే వారికి కూడా మంచి జరగాలి. మంచి పనులన్నీ చేయగలిగామని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ వివరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనకు ఓటు వేయని వారి ఇళ్ళకు కూడా మనం వెళ్లాలి. చేసిన మంచిని వారికి వివరిస్తే..ఖచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది' అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. 'సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమిస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తాం. గృహసారథుల్లో ఒకరు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి. ప్రజలతో పార్టీ క్యాడర్ మమేకం కావాలి. ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్ అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి.' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
175కి175 సాధ్యమే
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలమన్నారు. అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోందని, కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80 శాతానికి పైగా క్లీన్ స్వీప్ చేయగలిగామని సీఎం జగన్ అన్నారు. 'విజయవాడ ఈస్ట్‌లో కూడా 21 వార్డుల్లో 14 చోట్ల గెలిచాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం. మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. ఏమైనా సమస్యలు ఉంటే మనంలో మనం సర్దుబాటు చేసుకుందాం. ఖచ్చితంగా 175కి 175 సీట్లు గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా.. ప్రతి ఇంట్లోకూడా సంతోషం కనిపిస్తోంది. మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి, చదువులు మారుతున్నాయి, ఆస్పత్రులు మారుతున్నాయి. ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది. ఇంత మార్పు అన్నది ఎప్పుడూ కూడా జరగలేదు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా పూర్తి స్థాయిలో వస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలకు మనం అంతా కలిసి కట్టుగా పని చేయాలి. ఎలాంటి విభేదాలున్నా పక్కన పెట్టాలి' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి.' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైసీపీ ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.