BJP: సీఎస్​ కరవుందంటారు.. సీఎం లేదంటారు !

రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆరోపించారు..

Update: 2023-11-19 17:32 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆరోపించారు. కరవు విషయంలో సీఎస్​ ఒకటి మాట్లాడితే ముఖ్యమంత్రి మరొకటి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ పొంతన లేకుండా వ్యవసాయ మంత్రి సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు. అసలు ఇదేం పాలనంటూ ​ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు, ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. జగన్‌కు తన స్వార్ధం తప్ప ప్రజల పాట్లు అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంలో చలనం లేదని మండిపడ్డారు. అధికారులు కూడా స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

రోమ్ నగరం తగలపడుతుంటే.. ఫిడేల్ వాయించిన చందంగా సీఎం తీరు ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్​ విమర్శించారు. 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావడం లేదని ఆయన వెల్లడించారు. 20 లక్షల ఎకరాల్లో వరి సాగు నిలిపేసినట్లు సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వ చర్యలను వెల్లడించాలని సత్యకుమార్​ డిమాండ్​ చేశారు. వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయాల్సిన సమయంలో శుంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సొంత జిల్లానే కరవుతో ఉన్నా కనిపించకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుతున్నా.. ముందస్తు చర్యలు లేవని, ఇంత తీవ్రంగా కరవు ఉంటు.. కరవు మండలాలు మూడేననడం దారుణమన్నారు. పోలవరం కోసం ఇచ్చిన నిధులను తమ జేబుల్లో వేసుకుంటున్నారని సత్యకుమార్​ ఆరోపించారు.

రైతులకు సాగునీరు ఇవ్వలేని జగన్.. తమ సొంత కంపెనీలకు జీవోలు ఇచ్చి మరీ నీళ్లిస్తున్నట్లు సత్యకుమార్ పేర్కొన్నారు. 3.45 టీఎంసీలు ఇండో సోల్‌కు మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 1.37 టీఎంసీల నీటిని అరబిందో. 0.98 టీఎెంసీలు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు నీళ్లిచ్చినట్లు తెలిపారు. భారతి సిమెంట్స్‌కు, ప్రతిభ బయోటెక్‌కు ఇష్టానుసారంగా నీళ్లు మళ్లించినట్లు పేర్కొన్నారు. రాయలసీమలో దుర్భిక్షం తీవ్రంగా ఉన్న చోట్ల జగన్ ఇష్టారీతిన నీళ్లు మళ్లించినట్లు వివరించారు. రైతులకు తాగు, సాగు నీరు లేదని, సంస్థలకు మాత్రం నిరంతరాయంగా నీరు ఇవ్వడం దుర్మార్గం కాదా సత్యకుమార్​ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని సత్యకుమార్​ పేర్కొన్నారు.

Tags:    

Similar News