Ap News: ఏం చేసినా వెనక్కి తగ్గం.. పోలీసులకు అంగన్​వాడీల స్ట్రాంగ్ వార్నింగ్

అంగన్​వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు..

Update: 2023-09-25 13:58 GMT
Ap News: ఏం చేసినా వెనక్కి తగ్గం.. పోలీసులకు అంగన్​వాడీల స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: అంగన్​వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అంగన్​ వాడీలను విజయవాడ రానివ్వకుండా నిర్బంధించారు. శాంతియుత నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను పోలీసులు కాలరాయడాన్ని కార్మిక సంఘాలు కన్నెర్ర జేస్తున్నాయి. ఈ ఘటనపై టీడీపీ యువనేత నారా లోకేష్​ స్పందించారు. అంగన్​వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. టీడీపీ అంగన్​వాడీ కార్యకర్తల అసోసియేషన్​ నేత సునీత ఘటనను ఖండించారు. ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ అఖిల భారత ట్రేడ్​ యూనియన్లు మంగళవారం రాష్ట్ర వాప్త నిరసనకు పిలుపునిచ్చాయి.

అంగన్​వాడీలను విజయవాడలోని పలు ఫంక్షన్​ హాళ్లలో నిర్బంధించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్​టీయూ నేతలు ఏవీ నాగేశ్వరరావు, కారుసాల సుబ్బరావమ్మ, బేబిరాణి, జీ ఓబులేసు, లలితమ్మ, పోలారి అరెస్టులను అఖిల భారత ట్రేడ్​ యూనియన్స్​ ఖండించాయి. ‘తెలంగాణ కన్నా ఒక్క రూపాయి అయినా ఎక్కువగా ఇస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. దీనికి అదనంగా మరింత పని భారం పెంచారు. తట్టుకోలేక అంగన్​వాడీలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీనిపై న్యాయం చేయాలని రోడ్డెక్కితే పోలీసులను ఉసిగొల్పడం దారుణం.’ అని కార్మిక సంఘాల నేతలు దుయ్యబట్టారు. పోలీసుల తోపులాటలో అనంతపురం జిల్లా అంగన్​వాడీల సంఘం అధ్యక్షురాలు శంకుతలకు పోలీసుల తోపులాటలో మోకాలికి గాయమైంది. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.


Similar News