ఏపీ ఎమ్మెల్యేకు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ అస్వస్థతకు గురయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్(Krishna district MLA Varla Kumar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు తొలుత పామర్రులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. వర్ల కుమార్ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భాగంగా సోమవారం పామర్రు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించారు. దీంతో ఆయనకు ఎండ దెబ్బ తగిలిందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం వర్లకుమార్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఒక రోజు పర్యవేక్షణలో ఉంచుకోనున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పామర్రు టీడీపీ శ్రేణులు ఆస్పత్రికి వద్దకు భారీగా చేరుకున్నారు. వర్ల కుమార్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వర్ల కుమార్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు వర్ల కుమార్ కుటుంబ సభ్యులు తెలపడంతో సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో కోలుకుని పార్టీ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడే వర్ల కుమార్. తండ్రి అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి పామర్రు ఎమ్మెల్యేగా వర్ల కుమార్ ప్రజలకు సేవ చేస్తున్నారు.