ఏపీకి అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా జగన్ స్పందించరేం?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మచ్చుక సైతం కనిపించడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మచ్చుక సైతం కనిపించడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. జగన్‌ను ఇంటికి సాగనంపితే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి జరగదని అన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరినీ లెక్కచేయడం లేదని...చివరికి న్యాయస్థానాల తీర్పులను సైతం పట్టించుకోవడం లేదన్నారు. మడు రాజధానుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని అయినప్పటికీ విశాఖకు రాజధాని తరలింపు చేయాలి అనుకోవడం దుర్మార్గం అన్నారు. రాజధానిని తరలిస్తే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల పరిధిలో ఉన్నాయన్నారు. ఆ జిల్లాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఎలాంటి ఆలోచన చేయకుండా కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా సీఎం జగన్ కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజధాని తరలింపు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అనంతపురంకు తాగు, సాగు నీరు రాకుండా ఇప్పటికే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల మీద కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందన్నారు. కేంద్రం చర్యల వల్ల రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం జరుగుతుంటే ఈ సీఎం వైఎస్ జగన్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే సాహసం కూడా చేయడం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మంచి చేయలేని నీకెందుకు వై నాట్ 175 అని ప్రశ్నించారు. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వారంతా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం ఉద్ధరించారో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ నిలదీశారు.