‘నా జోలికొస్తే..మ్యాజిక్ చేసి..మంత్రం వేసి మాయం చేస్తా’..ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు: ప్రత్యర్థులకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు బూతులు, చీవాట్లు ఇంకాస్త ముందుకెళ్తే భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి.
దిశ , డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు బూతులు, చీవాట్లు ఇంకాస్త ముందుకెళ్తే భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. ఎక్కువగా బూతులు తిట్టే వారికి మాస్ లీడర్ అని బిరుదులు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇవే ట్రెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఊర మాస్ స్టైల్లో డైలాగుల వార్ కూడా నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లో ఖబడ్డార్, నీ అంతు చూస్తాం అనే వార్నింగ్‌లు తరచూ వింటూనే ఉంటాం. ఒక రాజకీయ నాయకుడు మరో నాయకుడిపై విమర్శలు చేస్తే అందుకు అవతలి నాయకుడు ఘాటుగా స్పందిస్తే... నా జోలికి వస్తే నీ అంతు చూస్తా’.. ‘నీ సంగతి ఏంటో తేలుస్తా’.. ‘నీ అడ్రస్ గల్లంతు చేస్తా’ అంటూ ఊర మాస్ స్టైల్లో వార్నింగ్‌లు ఇస్తూ ఉంటారు. ఇవి తరచూ వింటూనే ఉంటాం. ఇక ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న చోట అయితే ఈ వార్నింగ్‌లు మరింత ఘాటుగా ఉంటాయి. లేపేస్తా...చంపేస్తా ఇలాంటివి ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా వార్నింగ్ ఇచ్చారు టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్. నా జోలికి వస్తే చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు. యువనేత సీరియస్‌గా ఉన్నారు ఇంకా డైలాగ వారే అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో ‘మ్యాజిక్ చేసి.. మంత్రం వేసి.. మాయం చేస్తా’ అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.‘మీ స్కూల్లో తిక్క మాటలు మాట్లాడటం నేర్పించారు. మాకూ ఒక స్కూల్ ఉంది. అందులో నాకు మ్యాజిక్ నేర్పించారు’ అంటూ సెటైర్లు వేశారు.‘నేను మ్యాజిక్ చేసి… మంత్రం వేసి మాయం చేస్తా.. కాకపోతే నాకు మ్యాజిక్ సగమే నేర్పించారు మా స్కూల్‌లో. మాయం చేసిన తర్వాత తిరిగి తీసుకురావడం నేర్పించలేదు. కాబట్టి నేను మంత్రం వేసే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ ప్రత్యర్ధులకు నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఆ మంత్రం చాలా భయంకరంగా ఉంటుందంటూ ఘాటుగా హెచ్చరించారు. మా స్కూల్‌లో నేర్పించిన విధానం వేరుగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో మ్యాజిక్ చేసి, మంత్రం వేసి మాయం చేస్తా అంటూ పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు చేయడంతో అంటే ఏదో కనికట్టు చేయబోతున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి.