Ap News: టీడీపీలోకి వైసీపీ ఎంపీ.. ఆ మహిళా మంత్రే పంపిస్తున్నారా..?

ఉన్నత విద్యావంతుడు. నీతి నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడే వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలుపొందారు...

Update: 2023-02-09 12:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉన్నత విద్యావంతుడు. నీతి నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడే వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా దూకుడు పెంచారు. అయితే అక్కడ కూడా నైతిక విలువలు, అవినీతి ఉండకూడదు అంటూ క్లాస్‌లు పీకేవారు. అంతేకాదు వివాద రహితుడు. సౌమ్యుడు. అలాంటి ఎంపీని మహిళా మంత్రి, ఎమ్మెల్యేలు దూరం పెట్టేశారు. ఒకరి తర్వాత ఒకరు ఎంపీని టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు ఎంపీ పార్టీ మారతారంటూ లీకులు ఇస్తున్నారు. సొంతపార్టీ నేతల తిరుగుబాటుతో ఆ ఎంపీ సైతం సైలెంట్ అయిపోయారు. అధిష్టానం సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఎంపీ ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరో కాదు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. ప్రస్తుతం ఎంపీ లావు అసమ్మతితో సతమతం అవుతున్నారు. ఈ అసమ్మతితో వేగలేక టీడీపీలోకి చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

ఏడాది తర్వాత చెలరేగిన చిచ్చు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ స్థానం నరసరావుపేట. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు ఘన విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఎంపీగా గెలుపొందిన ఏడాదిపాటు ఆయనకు ఎమ్మెల్యేలు, నేతలు హారతిపట్టేవారు. ఎంపీ వివాదరహితుడు, అవినీతిని ప్రోత్సహించని వ్యక్తి కావడంతో అంతా కలిసి మెలిసి పని చేసుకున్నారు. అంతే ఏడాది తర్వాత ఇక అసలు సిసలైన రాజకీయం నడిచింది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య గ్యాప్ వచ్చింది. కొంతమంది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అయితే మా నియోజకవర్గానికి రావొద్దంటూ పరోక్షంగా సంకేతాలిచ్చేశారు అంటే ఎంతలా అసమ్మతి చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. నరసరావుపేట ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. చిల‌క‌లూరిపేట‌, స‌త్తెన‌ప‌ల్లి, పెద‌కూర‌పాడు, గుర‌జాల‌, మాచ‌ర్ల, వినుకొండ‌, న‌ర‌స‌రావుపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో న‌ర‌స‌రావుపేట‌, స‌త్తెనప‌ల్లి మిన‌హా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీకి అసలు పొసగడం లేదు. ఎంపీని అసలు పట్టించుకోవడం లేదని కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.


విడదల రజినీతో మెుదలై...

తొలుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అందుకు కూడా కారణం లేకపోలేదు. విడదల రజినీకి వ్యతిరేకంగా పని చేసిన వారితో ఎంపీ లావు సఖ్యతగా ఉండటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారట. ముఖ్యంగా మర్రి రాజశేఖర్‌తో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కలిసి ఉండటాన్ని ఎమ్మెల్యే తట్టుకోలేక ఎంపీపై తిరుగుబాటుకు దిగారట. కొన్ని సందర్భాల్లో మంత్రి విడదల రజినీ అనుచరులు ఎంపీ కాన్వాయ్‌ను సైతం అడ్డుకున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. అప్పటి నుంచి మెుదలైన రాజకీయ వివాదం నేటికి కొనసాగుతోంది. అనంతరం ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు తమ నియోజకవర్గంలో భూసేకరణ సమయంలో రైతుల వద్ద లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదికాస్తా రాజకీయంగా దుమారం రేపింది. ఆ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి విడదల రజినీ అధిష్టానానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అనంతరం మంత్రి విడదల రజినీ తన ఫోన్లపై నిఘాపెట్టారని పలువురు అధికారులపై మంత్రి విడదల రజిని ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. అయితే అదంతా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చేయిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మంత్రి వర్సెస్ ఎంపీగా చిలకలూరిపేట రాజకీయం నడుస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

బ్రహ్మనాయుడుతోనూ అంతే...

నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు, మంత్రి విడదల రజని మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కాస్తా కొత్తగా టర్న్ తీసుకుంది. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా అసమ్మతి వర్గంలో చేరిపోయారు. ఎంపీ లావు వైసీపీలో చేరినప్పుడు తనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును పార్టీలోకి తీసుకువచ్చారు. లావు, బొల్లా, మక్కెన మల్లిఖార్జునరావులు ముగ్గురూ ఒకే సామాజికర్గానికి చెందిన వారు. అయితే బొల్లాకు మక్కెనకు రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. మరోవైపు మక్కెనను ఎంపీ లావు వైసీపీలోకి తీసుకురావడం, ఎంపీ అయిన తర్వాత రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడంతో బ్రహ్మనాయుడు ఎంపీకి దూరమయ్యారనే వార్తలు ఉన్నాయి. వినుకొండకు తాను ఎమ్మెల్యే అయినా.. ఎంపీ మాత్రం మక్కెనకు ప్రాధాన్యం ఇవ్వడంపై బ్రహ్మనాయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఎమ్మెల్యే బొల్లా వద్ద పనులు కాని వారిని పిలిపించి మరీ ఎంపీ దగ్గర కూర్చోబెట్టి పనులు చేయించి పెడుతున్నారట మక్కెన మల్లిఖార్జునరావు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రుసరుసలాడుతున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని.. మక్కెనకు ఎంపీ ఎలా వత్తాసు పలుకుతారని ఒంటి కాలిపై లేస్తున్నారట. ఎంపీని తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయడం లేదట. ఇలా వినుకొండలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉందట.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాల్లోకి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయులు తొలి ప్రయ‌త్నంలోనే ఎంపీగా గెలుపొందారు. మంచి వ్యక్తి.. ఉన్నత విద్యావంతుడిగా ఆయనకు ప్రజల్లో మంచి పేరుంది. అయితే ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య సఖ్యత లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా అన్నదానిపై చర్చ జరుగుతుంది. అంతేకాదా టీడీపీ ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు హాజరయ్యారు. అప్పట్లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పటి నుంచి ఎంపీ లావు టీడీపీతో టచ్‌లోకి వెళ్లారని సొంత పార్టీ నేతలే దుష్ప్రచారం చేశారట. అప్పటి నుంచి అధిష్టానం కూడా లావుపై శీతకన్ను వేసినట్లు తెలుస్తోంది. టీడీపీతో తాను టచ్‌లోకి వెళ్లలేదని, అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఎంపీ వైసీపీ అధిష్టానానికి వివరణ సైతం ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం కాస్త దూరం పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో న‌ర‌స‌రావుపేట టికెట్‌కు వేణుగోపాల్ రెడ్డికి ఇస్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి ఎంపీ లావుకు ఎక్కడ అవ‌కాశం క‌ల్పిస్తారు? అనే దానిపై నరసరావుపేటలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయుల రాజకీయ భవిష్యత్‌పై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు... వేణుగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే లావుకు ఏ టికెట్ ఇస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి: 

Kakinada ఆయిల్ ఫ్యాక్టరీ బాధితులకు పరిహారం ప్రకటన  

Tags:    

Similar News