District SP:బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.. డ్రోన్ల సహాయంతో నిఘా
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
దిశ ప్రతినిధి, బాపట్ల: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలోని సమావేశ హాల్లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సిసిటిఎన్ఎస్ నివేదికను ఆధారం చేసుకొని కేసుల దర్యాప్తు, ఛార్జ్ షీట్ నమోదు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు, చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రాత్రి సమయాల్లో గస్తీ విధులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పై తీసుకోవలసిన చర్యలు, శక్తి యాప్ గురించి అవగాహన, పి.జి.ఆర్.ఎస్ అర్జీల విచారణ తదితర విషయాల పై జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయాలన్నారు. హైవేల దగ్గరలో ఉన్న వెంచర్లు, శిథిలావస్థలో, నిరుపయోగంగా ఉన్న భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్నారు. అటువంటి ప్రదేశాల పై నిఘా ఉంచాలన్నారు. తరచూ ఆ ప్రదేశాలను సందర్శిస్తూ ఉండాలన్నారు. డ్రోన్ల సహాయంతో నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైతే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఆ ప్రదేశాలను గుర్తించి అక్కడ రోడ్డు ప్రమాదాలు తరచూ జరగడానికి గల కారణాలను అధ్యయనం చేయాలన్నారు.
అ ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు, బ్లింకింగ్ లైట్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం, చెట్ల పొదలను తొలగించడం వంటి చర్యలతో పాటు ఆ ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన కూడళ్ళు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, వాణిజ్య దుకాణాలు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలోనే నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కేసులను చేదించడంలో సీసీ కెమెరాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. వాటిని ఉపయోగించి త్వరితగతిన అత్యంత సులువుగా కేసుల దర్యాప్తు చేయవచ్చు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీలు మరలా మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పోలీస్ స్టేషన్లకు, పోలీస్ కార్యాలయాలకు వచ్చే అర్జీ దారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యను కూలంకషంగా విని తగిన చర్యలు తీసుకుంటామని భరోసాను వారికి కల్పించాలన్నారు. అర్జీ దారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, దూషించిన ఉపేక్షించబమని హెచ్చరించారు. వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. దీనికి ప్రధాన కారణం వేసవి సెలవుల్లో చాలామంది విహారయాత్రలకు బంధువుల ఇళ్లకు తీర్థయాత్రలకు వెళుతుంటారన్నారు. ఆ సమయాల్లో వారి గృహాలలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా వేసవి తాపంతో చాలామంది ఆరుబయట నిద్రిస్తూ ఉంటారన్నారు. ఆ సమయంలో ఇంటికి తాళాలు వేయకుండా ఉండడం తో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. కనుక పోలీస్ అధికారులు వారి పరిధిలో గస్తీ విధులను ముమ్మరం చేయాలన్నారు. ఎవరైనా అనుమానితులు తారసపడితే వారిని విచారించి మొబైల్ సెక్యూరిటీ చెక్డ్ డివైస్ ద్వారా వారి వేలిముద్రలు స్కాన్ చేయాలన్నారు. అనుమానితులు ఎక్కడైనా నేరం చేసినట్లు దానిలో వస్తే వారిని అదుపులోకి తీసుకొని విచారించాలన్నారు. చెడు నడతను కలిగిన వ్యక్తులు పాత నేరస్తుల పై నిఘా ఉంచాలన్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉన్నదని గ్రహిస్తే వెంటనే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.
పాత నేరస్తుల మరలా ఏదైనా నేరానికి పాల్పడితే సంబంధిత పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అత్యంత నేర స్వభావం కలిగిన 20 మంది పాత నేరస్తులను గుర్తించడం జరిగిందన్నారు. వారిపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతంగా నిర్వహించాలన్నారు. కేసుల విచారణలో నైపుణ్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి ముద్దాయిలను అరెస్టు చేయాలన్నారు.
కేసులో భౌతిక సాక్షాదారాలు సేకరించి వాటిని నిపుణుల పరిశీలనకు పంపి వారు ఇచ్చే నివేదికను త్వరగా పొంది సంబంధిత కోర్టులో పూర్తి ఆధారాలతో చాట్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసు యొక్క వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎంఎస్ లో అప్లోడ్ చేయాలన్నారు. వచ్చే నెల నుంచి సీసీటీఎన్ఎస్ నివేదిక ఆధారంగా నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి.విఠలేశ్వర్, బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, చీరాల డిఎస్పి మోయిన్, రేపల్లె డిఎస్పి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ విజయ సారథి, ట్రైనీ డీఎస్పీ రావూరి అభిషేక్, జిల్లా ఎస్ బి ఇన్స్పెక్టర్ నారాయణ, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ బాల మురళీకృష్ణ జిల్లాలోని ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.