‘దిశ’ క్యాలెండర్ ఎఫెక్ట్.. జిల్లా కలెక్టర్ కీలక సమావేశం!?
చారిత్రాత్మక సంపదను భద్రం చేస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు.
దిశ ప్రతినిధి, బాపట్ల: చారిత్రాత్మక సంపదను భద్రం చేస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. పర్యాటకశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాకతీయుల నాటి దేవాలయాలు, చోళుల నాటి దేవస్థానాలను వారసత్వ సంపదగా బాపట్ల జిల్లాలో ఉన్నాయని, చారిత్రాత్మకమైన దేవస్థానాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సూర్యలంక బీచ్ కి రెండు లక్షల మంది పర్యాటకులు ఒకే రోజు వస్తుంటారని, బీచ్ ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. దుస్తులు మార్చుకోవడానికి, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీటి సౌకర్యం కల్పిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. బీచ్ లో హెచ్.పి.వి పైప్ ఏర్పాటుతో పర్యాటకులు సురక్షితంగా సముద్ర స్నానానికి వీలుగా ఉంటుందన్నారు.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలన్నారు. 1,650 కొబ్బరి మొక్కలు నాటడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిన్నగంజాం మండలంలో మోటుపల్లి బీచ్ వద్ద వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయుల నాటి వీరభద్ర స్వామి ఆలయం ఉందని కలెక్టర్ తెలిపారు. ఆనాటి అభయ శాసనం ఆలయంలో ఉందని పేర్కొన్నారు. రెండు వేల సంవత్సరాల చరిత్ర గల బుద్ధ స్థూపం భట్టిప్రోలు మండలం లో ఉందన్నారు. వేటపాలెం మండలం లో సుమారు వంద సంవత్సరాల క్రితం ప్రారంభించిన సారస్వత నికేతనం గ్రంథాలయం ఉందన్నారు. జాతీయ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ వేటపాలెం వచ్చినప్పుడు విరిగిన గాంధీ చేతి కర్ర ఇక్కడ వదిలి వెళ్లినట్లు తెలిపారు.
బాపట్ల పట్టణంలో వెయ్యేళ్ల క్రితం చోళులు నిర్మించిన ఆనాటి బావన్నారాయణ స్వామి దేవాలయం ప్రాచుర్యంలో ఉందన్నారు.అద్దంకి మండలం లో సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం లో ఉందని చెప్పారు. బాపట్ల మండలం పేరలి గ్రామంలో పర్యాటకులు బోట్లతో షికారు చేయడానికి సౌలభ్యం ఉందన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో బగళాముఖీ దేవి శక్తి పీఠం ఉందన్నారు. పర్యాటక శాఖ ద్వారా నిధులు కేటాయించి వీటిని అభివృద్ధి చేస్తే బాపట్ల జిల్లా పర్యాటక ప్రాంతంగా మారుతుందని తెలిపారు. వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నిధుల కేంద్రానికి నివేదిక పంపాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ఆపరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి, శివషరమ్, తదితరులు పాల్గొన్నారు.