అప్పన్న ధ్వజస్తంభంకు స్వర్ణకాంతులు
దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ధ్వజస్థంభం స్వర్ణకాంతులీనుతుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ధ్వజస్థంభం స్వర్ణకాంతులీనుతుంది. ఇప్పటి వరకు ఈ ధ్వజస్థంభం ఇత్తడి తాపంతో భక్తులకు దర్శనమిచ్చేది. అయితే బంగారు తాపడం చేయించేందుకు ప్రముఖ వస్త్ర, నగల వ్యాపార సంస్థ సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ముందుకు వచ్చారు. సుమారు 1.8 కేజీల బంగారం (1802 గ్రాములు)తో ఈ ధ్వజస్థంబానికి స్వర్ణతాపడం పనులు పూర్తి చేయించారు. ఇక మీదట అప్పన్న భక్తులకు సింహాద్రినాధుడి ధ్వజస్థంభం దర్శనం బంగారు కాంతులతో కానరానుంది. బుధవారం ఉదయం నుంచి తాపడం పనులు పూర్తి చేశారు. సాయంత్రం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఇన్ చార్జ్ ప్రధానార్చక వెంకటరమణాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరసింహం ఆచార్యులు, అర్చక పరివారం, వేద పండితులు ఆయా పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత విశ్వక్సేన, పుణ్యహవచనం, మహాసంప్రోక్షణ, షోడసోపచార పూజలు, గరుడ మూలమంత్రం, పంచసూక్తాలతో ప్రత్యేక హోమం నిర్వహించారు.