ఒక్కో తలపై రూ.5.50లక్షల అప్పు.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై సగటున రూ.5.50 లక్షల అప్పు ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై సగటున రూ.5.50 లక్షల అప్పు ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అప్పుల భారం రాష్ట్రంలోని ప్రతీపౌరుడికి తలకుమించిన భారంగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లకు దాటిపోయిందని, అయినప్పటికీ అటు కేంద్రం గానీ, ఇటు ఆర్బీఐ గానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. ఇంతటి దుర్భర పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేయడమే కాకుండా అధ: పాతాళానికి నెట్టారని ఆరోపించారు.
ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ పై మూడేళ్ల సీఐజీ రిపోర్టులు తీసుకొని విశ్లేషిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతలా పతనమైందో తెలుస్తుందన్నారు. జగన్ రెడ్డి పాలన అంతమయ్యే సమయానికి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ బడ్జెట్ బారాయిన్స్ కూడా దాదాపు 5ఏళ్లలో ఇంచుమించు రూ. 5 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఓడి, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్సులు మూడు కలిపి ఈ 5 సంవత్సరాల్లో రూ.5 లక్షల కోట్లకు చేరబోతున్నాయని చెప్పుకొచ్చారు. అన్నీ కలిపి రూ. 12. 5 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉంది. మార్చి 2024 నాటికి ఔట్ స్టాండింగ్ అప్పులు పెరగనున్నట్లు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
రూ.48వేల కోట్ల మేర నిధులు దుర్వినియోగం
రాబోయే భవిష్యత్తు కాలంలో ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, రోజువారి నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగి రూ.15,000 కోట్ల భారం ప్రజలపై పడనుందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జనాభా పరంగా దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో రూ.75,000 కోట్ల మేర అదనపు భారం పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక వడ్డీలు తీసుకురావడం ఒక్కొక్కరిపై రూ.5,50,000 వరకు అదనంగా భారం పడింది అని యనమల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఏటా రూ. 54,000 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతోంది. వైసీపీ ఐదేళ్ల పదవీ కాలం పూర్తియే నాటికి సరాసరి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద రూ.2,70,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నమని ప్రకటించారు.
ప్రభుత్వం సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తుందని గొప్పలు చెబుతున్నప్పటికి అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందండం లేదని కాగ్ రిపోర్టు లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయని వివరించారు. ఇప్పటికే ప్రత్యక్ష నగదు బదిలీ నిర్వహణలో రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో ఉంది. స్వయం సంవృద్ధిలో దేశంలోనే ఏపీ 19 వ స్థానంలో ఉంది. రోజు రోజుకు ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. 2019-20 వ ఆర్థిక సంవత్సరానికి రూ.48 వేల కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2020-21 వ సంవత్సరానికి సంబంధించిన 1 లక్ష కోట్లకు లెక్కలు బయటకు చూపించలేదు. 2021-22 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,18,000 కోట్లకు లెక్కలు బహిర్గతం చేయలేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.