ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పు పక్కా.. ఆ సర్వేలో ప్రధాన పార్టీలకు వచ్చే సీట్లపై క్లారిటీ?
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధిస్తామని డాంబికాలు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తప్పదా? పలు సర్వేలు టీడీపీ-జనసేన కూటమికి అనుకూల ఫలితాలిస్తున్నాయా? ఒకవైపు సర్వేలు, మరోవైపు అభ్యర్థుల చేర్పు మార్పులతో వైసీపీ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారం చేపట్టనుందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ తేల్చి చెప్పిన సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానచలనం కలిగిన వారితో పాటు సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాల పర్వం కొనసాగిస్తూ అధికార పక్షంలో గుబులు రేకెత్తిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత రా..కదలిరా సభలతో జనంలోకెళ్లి జోష్ ను పెంచుతున్నారు.
దిశ, కర్నూలు ప్రతినిధి: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధిస్తామని డాంబికాలు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ సర్వే బృందాలతో పాటు హైదరాబాద్ వేదికగా పని చేస్తున్న ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్, వివిధ ప్రయివేట్ సంస్థలు రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేనలదే అధికారం అని తేల్చి చెప్పాయి. వీటిపై నమ్మకం లేని జగన్ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాల్లో భాగంగా అక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలపై రహస్య సర్వే చేయించి వాటి నివేదికలు తన వద్ద ఉంచుకున్నారు.
జగన్ తీరుపై సిట్టింగుల మండిపాటు..
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపుతాయనే భావనతో అందుకు తగిన వ్యూహానికి జగన్ శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల మార్పు చేర్పులు, తొలగింపు వంటివి చేపట్టారు. ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించారు. అందులో కొందరికి స్థాన భ్రంశం కల్పించగా కొందరు సిట్టింగులకు మొండిచేయి చూపి కొత్తవారికి స్థానం కల్పించారు. మూడు దఫాలుగా ప్రకటించిన జాబితాలో 60 మందిని మార్చారు. జగన్ వ్యవహార శైలిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఏమి చేయలేక పక్క పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొందరు వైసీపీకి, తమ పదవులకు రాజీనామాలు చేసి టీడీపీ, జనసేనలో చేరుతుండగా మరి కొందరు టీడీపీలో చేరేందుకు సన్నద్ధమౌతున్నారు.
ఏ సర్వే ఏం తేల్చిందంటే..
ప్రస్తుతం వైసీపీ అధినేత రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను తొలగిస్తూ..స్థానాలను మారుస్తూ సొంత పార్టీ నేతలను బెంబేలెత్తిస్తున్నారు. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పక్కకు పోవద్దు అన్నట్లుగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. జనసేనతో పొత్తుతో ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇక అటు కాంగ్రెస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. వైఎస్ షర్మిలను ముందు పెట్టి రాజకీయం నడిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరిది ? ఏ పార్టీకి ఎంత బలం ఉంది ? అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. ఎవరికెన్ని సీట్లు వస్తాయనే దానిపై ఓ నివేదిక రిలీజ్ చేసింది.
ఐ ప్యాక్ సర్వే ఏం చెప్పిందంటే..
ఈ సంస్థ గతంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ సర్వేలు చేసింది. ఇప్పుడు తాజాగా ఏపీలో ఫలితాలపై అంచనాలను ప్రకటించింది. సీఎంగా జగన్‌కు మంచి ఆదరణ ఉన్నా.. టీడీపీ-జనసేన కూటమే అధికారంలోకొచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. 2023 నవంబర్లో సీఎం జగన్ నేతృత్వంలోని ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ చేపట్టిన ఐ ప్యాక్ సర్వే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా వైసీపీకి ఓటమి తప్పదని తేల్చి చెప్పింది. ఈ సారి టీడీపీ-జనసేన కూటమికి 144 వస్తాయని, వైసీపీకి 31 మించి సీట్లు రావని తేల్చిచెప్పింది. ఇక డిసెంబర్లో శ్రీ ఆత్మసాక్షి సంస్థ టీడీపీ-జనసేన కూటమికి 108, వైసీపీకి 60 సీట్లు వస్తాయని చెప్పింది.
తాజా సర్వే ఫలితాలు ఇవీ..
స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ ఏపీని మూడు రీజియన్లుగా విభజించి సర్వే చేయించింది. ఆ వివరాలు ఇవి: ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాలకు గానూ వైసీపీకి 12 నుంచి 16 వరకు వస్తాయి. టీడీపీ-జనసేన కూటమి 18 నుంచి 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో మొత్తం 85 స్థానాలకు గానూ వైసీపీకి 19-24 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 58-65 స్థానాలు వస్తాయి. రాయలసీమలోని మొత్తం 52 స్థానాలకు గానూ వైసీపీ మెజార్టీ సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీకి 36-40 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 14-18 స్థానాలు వస్తాయి. రాష్ట్రం మొత్తమ్మీద చూస్తే టీడీపీ-జనసేన కూటమి 90 నుంచి 105 స్థానాల వరకు గెలుచుకోవచ్చు. వైసీపీకి 67 నుంచి 80 సీట్లు దక్కవచ్చు. ఇది మూడు నెలల నుంచి చేసిన సర్వే మాత్రమేనని, ఎన్నికల నాటికి ఈ సర్వేలు మారిపోయే అవకాశం ఉందని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ తెలిపింది.