మాజీ మంత్రి జోగి రమేశ్ నిర్వాకం.. అధికారుల మెడకు బిగుస్తున్న ఉచ్చు
మాజీ మంత్రి జోగి రమేశ్ నిర్వాకంతో ముగ్గురు అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ....
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్ నిర్వాకంతో ముగ్గురు అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం సర్వే 87లోని భూములను జోగి రమేశ్ కుమారుడు, బంధువులు అక్రమంగా అమ్మేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే సర్వే నెం. 87ను 88గా మార్చి భూములు విక్రయించినట్లు నిర్ధారణ అయింది. ఇందుకు అంబాపురం డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, సర్వేయర్ రమేశ్, గ్రామ సర్వేయర్ దేదీప్య సహకరించినట్లు ప్రాథమికంగా తేలింది. 87 సర్వేలోని భూములకు తప్పు ధృవీకరణ పత్రాలు మంజూరు చేసినట్లు ఎమ్మార్వో విచారణలో తేటతేల్లమైంది. దీంతో కలెక్టర్‌కు తహసీల్దార్ రిపోర్టు అందజేశారు. ఈ మేరకు ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది.
కాగా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో 87 సర్వేలోని భూములు అగ్నిగోల్డ్‌కు సంబంధించినవి. అయితే ఈ భూములపై 2018లో సీఐడీ కేసు నమోదు చేసింది. క్రయ, విక్రయాలకు నిషేధిత భూములుగా ప్రకటించింది. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ భూములపై జోగి రమేశ్ కుటుంబ సభ్యుల కన్ను పడింది. వెంటనే ఆ భూములను కొనుగోలు చేశారు. 2160 గజాలున్న ఈ భూములను 300, 400 చదరపు అడుగల ప్లాట్లుగా చేసి అమ్మేశారు. అయితే రెవన్యూ అధికారుల సహకారంతో 87 సర్వే నెంబర్‌ను 88గా మార్చి విక్రయించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో బాధితులు బయటకు వచ్చారు. జోగి రమేశ్, ఆయన కుమారుడితో పాటు, బంధువులపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.