ఆ గ్రామంలో బడికి వెళ్లే పిల్లలున్నా బడి తెరవరు..!?

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇంకా బడి లేని పల్లెలు ఉన్నాయంటే గ్రామీణ, పల్లెల్లో బడుగుల విద్య పై పాలకుల ప్రేమ ఏ పాటిదో అర్ధం అవుతుంది.

Update: 2024-09-29 11:08 GMT

దిశ, బుట్టాయగూడెం: శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇంకా బడి లేని పల్లెలు ఉన్నాయంటే గ్రామీణ, పల్లెల్లో బడుగుల విద్య పై పాలకుల ప్రేమ ఏ పాటిదో అర్ధం అవుతుంది. అప్పుడు బడిలో పిల్లలు లేరని పాఠశాలను మూసిన ప్రభుత్వం ప్రస్తుతం పిల్లలు ఉన్నా బడి తెరవకపోవడం ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మారుమూల పంచాయతీ కేంద్రం కోర్సవారిగూడెం గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలను 2010-2011 సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని బడిని మూసివేశారు. ఆదివారం మండలంలోని కోర్సవారిగూడెం గ్రామంలో బడి పిల్లలు, తల్లిదండ్రులు గ్రామస్తులతో పాఠశాల సమస్య పై మాట్లాడారు.

అనంతరం పాత మూసివేసిన పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, మండల అధ్యక్షులు కారం భాస్కర్ లు మాట్లాడుతూ కోర్సవారిగూడెం పంచాయతీ కేంద్రంలో 2010-11 సంవత్సరంలో విద్యార్థులు లేరని బడిని మూసివేశారని అన్నారు. ప్రస్తుతం పెద్ద కోర్సవారిగూడెం, చినకోర్సవారిగూడెం గ్రామంలో సుమారు 25 మంది చిన్నారులు ఉన్నారన్నారు.వీరంతా ప్రతిరోజూ సుదురా వెళ్లి ప్రాంతంలోని ఇనుమూరు, గవరంపేట, గురుగుమిల్లి పందిరిమామిడి గూడెం గ్రామాలలో ఉన్న పాఠశాలకు వెళ్తున్నారన్నారు. ఆ చిన్నారులను ఉదయం సాయంత్రం తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆయా పాఠశాలలకు తీసుకెళ్తున్నారన్నారు. 2010 సంవత్సరంలో బడిలో పిల్లలు లేరనే సాకుతో ఎంపీపీ స్కూల్ ను మూసి వేశారన్నారు. కోర్సవారిగూడెం రెండు గ్రామాలలో బడి లేదని మూసివేసిన బడిని పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని గ్రామంలో బడిని ప్రారంభం చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా సంఘాలతో ఆందోళన చెప్పడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కె గాంధీ, ముత్యాలు, సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News