TDP New Plan: ప్రత్తిపాడులో అనూహ్యంగా తెరపైకి సుభాష్ చంద్రబోస్ పేరు!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ సరికొత్త వ్యూహానికి తెర లేపుతోంది. గోదావరి జిల్లాల్లో కాపు కులంతో పాటు సమానంగా ఉండే తూర్పు కాపులకు గాలం వేసే పనిలో పడింది. ...
- ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యూహానికి పదును
- వైసీపీ కార్పొరేషన్లకు కులాల వారీగా కౌంటర్లు
- ప్రత్తిపాడులో ప్రయోగం?
- పరిశీలనలో పైలా సుభాష్ చంద్రబోస్ పేరు
దిశ, (ఉభయ గోదావరి ప్రతినిధి): ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ సరికొత్త వ్యూహానికి తెర లేపుతోంది. గోదావరి జిల్లాల్లో కాపు కులంతో పాటు సమానంగా ఉండే తూర్పు కాపులకు గాలం వేసే పనిలో పడింది. తూర్పు కాపులను అక్కున చేర్చుకొంటే అటు కాపులకు , ఇటు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే భావనలో పార్టీ ఉంది. వైసీపీ ప్రభుత్వం కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. దీనికి దీటుగా టీడీపీ సరికొత్త ప్లాన్ వేసింది. కులాల వారీగా సీట్లు ఇచ్చి వారిని ఆకట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయనే ఆలోచన చేస్తోంది. అక్కడ సీటు ఆశిస్తున్న వ్యక్తి సీనియర్ అయినా సరే, కులాల సమీకరణ మాత్రం కుదరకపోతే ప్రక్కన పెట్టే యోచనలో ఉంది. ఇందుకు ప్రత్తిపాడు నియోజకవర్గ వర్గాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఏలేశ్వరం మండలంలో అధికంగా తూర్పు కాపులున్నారు. అంతేగాక జిల్లాలోనే చాలా ప్రాంతాల్లో తూర్పు కాపులున్నారు. వాస్తవానికి వీరు బీసీల్లోకి వస్తున్నా, కాపులుగానే సంభోదిస్తారు. ఇప్పటిదాకా చాలా పార్టీలు తూర్పు కాపులకు అట్టే ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో ప్రయోగాత్మకంగా తూర్పు కాపులకు ప్రాధాన్యత ఇస్తే పార్టీకి మంచి మైలేజ్ వస్తుందనే ఆలోచనలో పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తోంది.
ప్రత్తిపాడులో ప్రయోగం?
తూర్పు కాపులకు సీటు ఇవ్వడానికి కాకినాడ జిల్లా ప్రత్తిపాడును ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం, మండలాలున్నాయి. నియోజకవర్గంలో 2 లక్షల పై చిలుకు ఓటర్లున్నారు. ఇందులో తూర్పు కాపులు 17 వేలు దాకా ఉన్నారు. వీరిలో చాలా మందికి జిల్లాలో ఎంతో మంది తూర్పు కాపులతో బంధుత్వం ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో తూర్పు కాపులకు ప్రాధాన్యత ఇస్తే ఆ ప్రభావం జిల్లా అంతా పడుతుందనే నమ్మకంలో టీడీపీ ఉంది. ఇప్పటిదాకా తూర్పు కాపులకు ఏ పార్టీ కూడా సీటు ఇచ్చిన దాఖలాలు లేవు. దీనికి తోడు తూర్పు కాపులు బీసీల్లోకి వస్తారు. వీరికి సీటు ఇస్తే బీసీ కోటా కూడా పిల్ అయినట్లు ఉంటుందని, కాపుల నుంచి కూడా వ్యతిరేకత రాదనే ఉద్దేశంలో ఉన్నారని సమాచారం.
పరిశీలనలో పైలా సుభాష్ చంద్రబోస్ పేరు
తాజాగా ఏలేశ్వరం గ్రామానికి చెందిన పైలా సుభాష్ చంద్రబోస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బోస్ కుటుంబం సుధీర్గకాలం నుంచి టీడీపీలో ఉన్నారు. బోస్ తండ్రి పైలా సత్యనారాయణ 1983 నుంచి పార్టీలో ఉన్నారు. నాడు దివంగత నందమూరి తారకరామారావుతో సత్యనారాయణకు మంచి సంబంధాలుండేవి. సత్యనారాయణ కూడా చాలా పదవులు చేశారు. 1995 అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా ఆయన ఏలేశ్వరం ఎంపీపీతో పాటు చాలా పదవులు చేశారు. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో సత్యనారాయణకు సీటు కన్పాం చేశారు. నాడు సత్యనారాయణ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పోటీకి అంగీకరించలేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలేశ్వరం మున్సిపాలిటీలో పోటీ చేసి గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పైలా సుభాష్ చంద్రబోస్ పార్టీలో చురుకుగా ఉంటున్నారు. జిల్లా నాయకులతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ చేసిన ఆయన ప్రస్తుతం కాకినాడ పార్లమెంటు స్థానంలో అధికార ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. తూర్పు కాపులకు సీటు ఇస్తే బోసు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.