ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు.. బకాయిలు విడుదల చేయండి: Nara Lokesh

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

Update: 2023-11-14 08:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈనెల 27లోపు బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామన్న ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ లేఖపై లోకేశ్ స్పందించారు. బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని లోకేశ్ మితవు పలికారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్‌కు రూ.1000కోట్లు బకాయిలు పెట్టడంతో సేవలు నిలిపివేస్తామని అసోషియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం బాధాకరమన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వైఎస్ఆర్ కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టినప్పుడే జగన్ రెడ్డి పనితనమేమిటో అందరికీ అర్థమైపోయిందన్నారు. చేతగానిపాలనతో ఖజానాను దివాలా తీయించిన సీఎం వైఎస్ జగన్ ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారు కావడం చూశామని లోకేశ్ చెప్పుకొచ్చారు. స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లకు దిక్కులేక వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూసినట్లు లోకేశ్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ అస్తవ్యవస్థ ఆర్థిక విధానాలతో ట్రిపుల్ ఎ ప్లస్‌గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ బి ప్లస్‌కు దిగజార్చారని నారా లోకేశ్ ఆరోపించారు. తాజాగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకపోవడం అంటే పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికైనా బకాయిలు చెల్లించి.. ప్రైవేట్ ఆస్పత్రులలో పేదలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News