ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు :సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.

Update: 2023-09-03 12:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని అఫిడవిట్‌లో కోరారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ కోరింది.ఇకపోతే వైఎస్ వివేకా హత్యకేసులో ఏ-8గా ఉన్న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో చాలెంజ్ చేసిన విషయాన్ని సీబీఐ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అంతేకాదు వైఎస్ వివేకా హత్యకు ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ అభిప్రాయపడింది. రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ మరోమారు అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది.ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని మరింత విచారించాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. వైఎస్ వివేకా హత్య జరిగితే గుండెపోటు అని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వైఎస్ వివేకానందరెడ్డితోపాటు కారులో వెళ్లిన నిందితుడు గంగిరెడ్డి ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశారని..అదే సమయంలో అవినాశ్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ సైతం ఉన్నారని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

Tags:    

Similar News