ఏపీకి దీపావళి ముందే వచ్చింది.. మంత్రి సత్య కుమార్
ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
దిశ, వెబ్డెస్క్: ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల రాక్షస పాలనకు జనం స్వస్తి పలికారన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు మళ్లీ గాడిలో పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై చాలా పెద్ద బాధ్యతలు ఉంచారని.. ఏపీని అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఏపీని అగ్రగామిగా నిలుపుతామన్నారు. అన్ని రంగాలను, సహజవనరులను దోచుకుని జగన్ ఏపీకి అస్థిత్వం లేకుండా చేశారన్నారు. ఐదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దాలంటే స్థిత ప్రజ్ఞత గల నాయకుడు అవసరమని చంద్రబాబు రూపంలో ఆ నేత ఏపీకి ఉన్నారన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో వికసిత భారత్, వికసిత రాష్ట్రం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన జిల్లాకు రాగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.