మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : అచ్చెన్నాయుడు
రాష్ట్రంలోని గంగపుత్రులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని గంగపుత్రులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ సముద్రతీరం, నిపుణులైన మన మత్స్యకుటుంబాలు రాష్ట్రానికి ఓ వరం అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్ర మత్స్య రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేశామని స్పష్టం చేశారు. 2014-19 ఐదేళ్ల కాలంలోనే ఏకంగా రూ.788.38 కోట్లను ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ఆదరణ పథకం కింద వలలు, పడవలు, ఐస్ బాక్సులు సహా ఇతర వృత్తి పరికరాలను 90% సబ్సిడీతో అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ ఇన్ ల్యాండ్ సొసైటీ మత్స్యకారులకు 75% సబ్సిడీతో వలలు, పడవలు అందించినట్లు చెప్పుకొచ్చారు. డీప్ సీ ఫిషింగ్ నెట్స్, ఏరియేటర్స్, ఇన్లాండ్ నెట్స్, ఇన్లాండ్ బోట్స్, ఫైబర్ బోట్స్, గిల్ నెట్స్, రిఫర్ వ్యాన్స్, సముద్రపు పంజరాలు అందించామని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డీజిల్ సబ్సిడీ తీసుకొచ్చి మత్స్యకారులకు తోడుగా నిలిచాం. దేశంలో తొలిసారిగా 50ఏళ్లు దాటిన మత్స్యకారులకు పెన్షన్ అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. మత్స్యకారుల పిల్లల చదువుల కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం. వేటకు వెళ్లి మరణించిన వారికి నెల రోజుల్లోనే డెత్ సర్టిఫికెట్ అందించి రూ.5లక్షల బీమా కల్పించాం. హేచరీల్లో చేపపిల్లలు పెంచి చెరువులు, రిజర్వాయర్లలో వదిలి మత్స్యకారులకు వేట బాధ్యతలు అప్పగించారు’ అని అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు. గతంలో ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, చేతకానితనంతో దిగజారిపోయింది అని ఆరోపించారు. ఆక్వా రైతులకు జగన్ రెడ్డి వచ్చాక విద్యుత్ సబ్సిడీ నిలిపివేశారన్నారు. రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లను మత్స్యకార సొసైటీలకు కాకుండా బహిరంగ వేలం వేసేలా జీవో నెం.217 తెచ్చి మత్స్యకారుల పొట్టకొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు, మత్స్యరంగానికి మెరుగైన రోజులు రావాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపైనా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
Read More..
చంద్రబాబుకు బెయిలొచ్చినా ఆగని ఆందోళన: మిగిలిన కేసుల్లో తీర్పులపై ఉత్కంఠ