Pawan Kalyan:రేషన్ బియ్యం మాఫియాకు చెక్.. రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ తో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది.
దిశ, డైనమిక్ బ్యూరో /కాకినాడ జిల్లా ప్రతినిధి: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ తో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పవన్ కాకినాడ పోర్టుకు చేరుకున్నారు. దీనికి ముందు ఏం జరిగిందంటే.. కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073 లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించారు. మొత్తంగా ఆ బియ్యం విలువ 6 కోట్ల 64 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ముగిసిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకుని మంగళగిరి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే దీనిపై దృష్టి సారించారు. ఈరోజు ఉదయం ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకున్నారు. ఆయన వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
ఈ పోర్టు నుంచే పిడిఎఫ్ పీఎం నిత్యం అక్రమంగా ఎగుమతి అవుతూ ఉందని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని కొంతమేర నియంత్రించారు. అయితే ఒకేసారి వెయ్యికి పైగా టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కలకలం రేగింది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలివెళ్లిపోతోందంటూ గగ్గోలు పెట్టిన కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ ఇదే సమస్య తప్పడం లేదు. కాకినాడ పోర్టులో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ వరుస తనిఖీలు చేస్తున్న పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తో వెళ్తున్న ఓ సౌతాఫ్రికా షిప్ ను జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు.
వివిధ మార్గాల ద్వారా కాకినాడ పోర్టుకు..
పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రభుత్వం కేజీ బియ్యం రూపాయికే అందిస్తోంది. అక్రమార్కులు ఈ బియ్యాన్ని వారికి చేరకుండానే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. సొంతంగా నౌకలు ఏర్పాటు చేసుకుని విదేశాలకు బియ్యం తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమంగా ఆర్జిస్తున్నారో తెలుస్తోంది. వివిధ మార్గాల ద్వారా ఆ బియ్యం కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సొంత షిప్పుల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్రమార్కులు అన్ని శాఖల సిబ్బంది సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.