ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్ : రెండు రోజులపాటు హస్తినలోనే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ అక్కడ నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరారు. సీఎం వైఎస్ జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలవనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం, శుక్రవారం దేశ రాజధానిలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం 6:30 కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ ఖరారు కావాల్సి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. అయితే శుక్రవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యేఅవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లడం...కేంద్రంతో భేటీ కావడంతో ఈ టూర్‌కు రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకుంది. అలాగే విభజన హామీలు, పెండింగ్ సమస్యలపై కేంద్రమంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.