సొంత ఇలాఖాకు సీఎం జగన్: రెండు రోజుల మకాం అక్కడే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత ఇలాఖా వైఎస్ఆర్ కడప జిల్లాకు చేరుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత ఇలాఖా వైఎస్ఆర్ కడప జిల్లాకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పేరుపేరున పలకరించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉదయం 11.38 గంటలకు రాయచోటిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో బయలుదేరారు. రాయచోటి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలిసి మాట్లాడారు.
పులివెందులలో పలు ప్రారంభోత్సవాలు
రాయచోటి పర్యటన అనంతరం సీఎం వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏపీ కార్ల్ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ కళాశాలలు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్‌లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఆదిత్య బిర్లా యూనిట్‌ను విజిట్ చేస్తారు. ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. అక్కడినుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.
ఈనెల 10న షెడ్యూల్ వివరాలివే..
ఇకపోతే ఈనెల 10న ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్.కే.వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఎకో పార్క్ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.