తిరుమల వెళ్లొద్దని అడ్డుకోలేదు.. నోటీసులు ఇవ్వలేదు: జగన్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

తిరుమల వెళ్లొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎవరు చెప్పారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు...

Update: 2024-09-27 13:30 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల వెళ్లొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్‌(Former Cm Ys Jagan)కు ఎవరు చెప్పారని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ప్రశ్నించారు. జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆయన స్పందించారు. తిరుమల(Tirumala) వెళ్లొద్దని జగన్‌ను ఎవరూ అడ్డుకోలేదని, నోటీసులు ఇవ్వలేదని, ఇస్తే చూపించాలన్నారు. లడ్డూ వివాదం నడుస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించొద్దని చెప్పామన్నారు. తిరుమలకు ఎవరు వెళ్లినా ఆచారాలు పాటించాలని చంద్రబాబు సూచించారు. ఇతర మతాల వారైనా ఆచారాలు పాటించాలన్నారు. వేల మందిని మొబిలైజ్ చేస్తామని స్థానిక వైసీపీ నాయకులు చెప్పారని, అందుకే తిరుపతిలో 30 యాక్ట్ అమలు చేశారని వెల్లడించారు. జగన్‌కు ఇష్టముంటే తిరుమల వెళ్తారని, లేకపోతే లేదని, కానీ ఆచారాలు పాటించాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. 

‘‘ఆచారాల ముందు ఎవరూ గొప్పకాదు. ఆచారాలు దిక్కరించేలా ప్రవర్తించకూడదు. ఇతర మతాలను గౌరవించాలి. సొంత మతాన్ని ఆచరించాలి. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు. రిపోర్టు దాచిపెడితే దేవుడు మమ్మల్ని క్షమించడు. తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడే బాధ్యత భక్తులందరిపై ఉంది. దేవాలయాల్లో అన్యమతస్తులకు అవకాశం ఇవ్వకుండా చట్టం తెస్తాం. జగన్ హయాంలో నిబంధనలు పాటించలేదు. రూ. 319కే నెయ్యి టెండర్ ఇచ్చారు. టెండర్ కండీషన్స్ మార్చారు. ముఖ్యమంత్రిగా జగన్ చట్ట వ్యతిరేక పనులు చేశారు. అన్నదానం, రూమ్స్, ప్రసాదం బాగలేవని భక్తులు ఆందోళన చేయలేదా.?. భక్తుల మనోభావాలు దెబ్బ తీశారు. ఆ అధికారం ఎవరిచ్చారు. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం పెట్టడానికి జగన్‌కు ఇష్టం లేదు, అందుకే తాడేపల్లిలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అని అంటే జగన్ ఎందుకు ఖండించలేదు.’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

‘‘గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదని చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి. పైరవీలు చేశారు. జంబో పాలక మండలి వేశారు. చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి సీఎం.. దాన్ని జగన్ ఉల్లంఘించారు. సంప్రదాయాలు పాటించొద్దని ఎవరైనా చెప్పారా.?. రూల్స్, అవకతవకలపై విచారణ ఉంటుంది.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.


Similar News