రాజధాని అమరావతి పనులకు మళ్లీ శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

ఆగిపోయిన రాజధాని అమరావతి పనులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది.

Update: 2024-10-19 07:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆగిపోయిన రాజధాని అమరావతి పనులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో 2014లో తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి విదితమే. అనాడు ప్రధాని నరేంద్ర మోడీతో రాజధాని భూమి పూజ నిర్వహింపచేశారు. అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మూడు రాజధానుల పేరుతో ఎక్కడా రాజధాని ఏర్పాటు చేయకుండానే వైసీపీ పాలన ముగిసిపోగా, అనంతరం జరిగిన ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్ళీ రాజధాని అమరావతి పనులు కొనసాగించాలని నిర్ణయించింది. ముందుగా 2017లో రూ.160 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించబడి వైసీపీ పాలనతో ఆగిపోయిన సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణా పనులను చంద్రబాబు ఉద్దండరాయుని పాలెం వద్ద పునఃప్రారంభించారు.

పెరిగిన అంచనాలతో రూ. 230 కోట్లతో ఏడు అంతస్తుల్లో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం పనులను ప్రారంభించారు. భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు. నాలుగు నెలల్లో పూర్తిగా సీఆర్డీఏ భవనం అందుబాటులోకి రానుందని చంద్రబాబు తెలిపారు. టాప్ 10 కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులు ఏర్పాటయ్యేలా ప్రణాళిక రూపొందించారు. మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 భవనాన్ని ఇక్కడ ప్రభుత్వం నిర్మిస్తోంది. అదనంగా పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్కు 2.51 ఎకరాల విస్తీర్ణం కేటాయించారు. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. "చరిత్రను తిరగరాసేందుకు మనమంతా ఇక్కడ సమావేశమయ్యామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మాదేనని, శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారని, అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటారని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, ఒక రాష్ట్రం, ఒక రాజధాని అని ఇప్పటికే స్పష్టం చేశామమని, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం" అని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి రైతులను రాజధాని, సమాజ హితం కోసం భూములు ఇచ్చారని, అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరించామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి కోసం ఇక్కడి రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. 


Similar News