చంద్రబాబు బెయిల్ షరతులపై సీఐడీ పిటిషన్.. తీర్పు రిజర్వ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండీషన్స్‌పై సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండీషన్స్‌పై సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దని, భారీ ర్యాలీలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టును సీఐడీ కోరింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారని కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాది తెలియజేశారు. ఈ మేరకు వీడియో క్లిప్పింగ్స్‌ను పెన్‌డ్రైవర్‌లో న్యాయస్థానానికి సీఐడీ తరఫు న్యాయవాది అందజేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చంద్రబాబు మీడియాతో మాట్లాడారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వాదించారు. అంతేకాదు 13 గంటల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ర్యాలీగా చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారని తెలిపారు. ర్యాలీ లు నిర్వహించ వద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పిన చేశారని కోర్టుకు సీఐడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ వచ్చిన తొలిరోజే చంద్రబాబు నిబంధనలను ఉల్లంఘించారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ఆదేశాలను ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అతిక్రమించలేదని ఆయన తరఫు న్యాయవాదలు వాదించారు. చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమించడం కాదని చెప్పుకొచ్చారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో న్యాయస్థానాలు కల్పించాయి అని చెప్పుకొచ్చారు. సీఐడీ విధించే షరతులు అన్నీ చంద్రబాుబ హక్కులు హరించే విధంగా ఉన్నాయని వాదించారు. ఇవి కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సీఐడీ అధికారులు చెప్పలేకోతున్నారు అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నవంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.