AP ఎక్సైజ్ శాఖలో అక్రమాలు.. సీఐడీ విచారణకు చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జరిగిన అవకతవలపై సీఐడీ విచారణకు ఆదేశించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జరిగిన అవకతవలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవలపై సమగ్ర విచారణ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడా నాణ్యత లేని మద్యం కనిపించకూడదని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచి విచ్చలవిడిగా దోచుకున్నదని అన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త పాలసీకి తీసుకొస్తామని తెలిపారు. కాగా, ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు టీంలను ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో ముగ్గురు చొప్పన అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక-తెలంగాణ, తమిళనాడు-కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లి అధ్యయనం చేయనున్నారు.