Tirumala:వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది.
దిశ, తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణ పాదుకలను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయం లోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడ సేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతుని పై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాల ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం దంపతులు డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.