51 రోజుల నుంచి ప్రజలకు దూరంగా చంద్రబాబు..!

‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్​బెయిల్ మంజూరు చేసింది.

Update: 2023-11-21 02:46 GMT
51 రోజుల నుంచి ప్రజలకు దూరంగా చంద్రబాబు..!
  • whatsapp icon

టీడీపీ అధినేత చంద్రబాబుకు ‘స్కిల్’ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇక సుప్రీంకోర్టులో క్వాష్​పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు వస్తే కేసులన్నీ ఎగిరిపోతాయి. ప్రతికూలంగా వస్తే మిగతా కేసుల్లోనూ బెయిల్​కోసం ప్రయత్నిస్తారు. సెప్టెంబరు 9 నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇక్కడ నుంచి విస్తృతంగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ అవినీతి ఆరోపణలతో పెట్టిన కేసులే ప్రధానాంశంగా ముందుకు సాగుతారా? ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. క్వాష్‌పై తీర్పును బట్టి తగిన నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు ఇక ఆట మొదలు పెడతారంటూ టీడీపీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి.


దిశ, ఏపీ బ్యూరో: ‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్​బెయిల్ మంజూరు చేసింది. ఇకనుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశముంది. మిగతా కేసుల్లో బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. రాజకీయ కక్షతోనే ఆయనపై పలు కేసులు నమోదు చేసినట్లు టీడీపీ శ్రేణులు గత యాభై రోజులకు పైగా పెద్దఎత్తున ఆందోళన చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు నిరసనలు తెలిపారు. చంద్రబాబు అరెస్టును దాదాపు అన్ని పార్టీలు ఖండించాయి. టీడీపీ ఊహించినంత స్థాయిలో సానుభూతి రాకున్నా.. అధికార పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతపై కేసులు బనాయిస్తోందనేది సగటు ప్రజల్లో బలంగా నాటుకుంది. ఇప్పుడు ఇదే ప్రధానాంశంగా తీసుకొని చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రజా సమస్యలపై పోరుబాట

మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతారని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా కరవుపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. సాగునీరందక పంటలు దెబ్బతిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ కరవు మండలాలను ప్రకటించి కేంద్రానికి పంపే ఆలోచన చేయడం లేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన కరవుతోపాటు సగటు ప్రజల ఆదాయాలు పడిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపశమన చర్యల్లేవు. పైగా మద్యం ధరలు పెంచింది. విద్యుత్ చార్జీలు నెలవారీ పెంచుకుంటూ వెళ్తోంది. నిత్యావసరాలపై కనీసం జీఎస్టీ పన్నులను కూడా మినహాయించలేదు. ఈ అంశాలన్నింటిపై చంద్రబాబు పోరుబాట పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

‘క్వాష్‌’పై అనుకూల తీర్పు వస్తే కేసులన్నీ రద్దు

సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై సానుకూల తీర్పు వస్తే ప్రభుత్వం చంద్రబాబుపై నమోదు చేసిన కేసులన్నీ రద్దవుతాయి. అప్పుడు ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించిందని జనంలోకి విస్తృతంగా వెళ్తారు. ఇప్పటిదాకా నమోదు చేసిన కేసుల్లో సీఐడీ సరైన సాక్ష్యాధారాలను న్యాయస్థానాలకు ఇవ్వలేకపోయింది. చంద్రబాబుకు అక్రమంగా డబ్బు చేరిందనడానికి ఒక్క ఆధారాన్ని కోర్టుల్లో ప్రవేశపెట్టలేకపోయింది. ఈ అంశాలన్నీ చంద్రబాబు పర్యటనల్లో ప్రస్తావించినా ప్రజా సమస్యలపై పోరాటానికే ఆయన ప్రాధాన్యం ఇవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ఇక ఆట మొదలు పెడతారంటూ టీడీపీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి.

Read More..

Breaking: చంద్రబాబుకు షాక్.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సీఐడీ  

Tags:    

Similar News