నా మీద ఉంటే ఆరోపించుకో కానీ టీటీడీని అంటే ఊరుకోను.. బీఆర్ నాయుడు ఫైర్
నా మీద ఏమైనా ఉంటే ఆరోపించుకో కానీ టీటీడీ బోర్డు మీద బురద జల్లాలని చూస్తే ఊరుకునేది లేదని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Board Chairman BR Naidu) హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్: నా మీద ఏమైనా ఉంటే ఆరోపించుకో కానీ టీటీడీ బోర్డు మీద బురద జల్లాలని చూస్తే ఊరుకునేది లేదని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Board Chairman BR Naidu) హెచ్చరించారు. టీటీడీ ఎస్వీ గోశాల (TTD SV Goshala)పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదివారం గోశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణాను మీడియా, అధికారులతో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని (MLA Pulivarthi Nani), టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (YCP Leader Bhumana Karunakar Reddy)పై ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన.. టీటీడీ గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులను తల్లిలా భావించి ఎప్పటికప్పుడు దాణా, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అంతేగాక ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫోటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను, తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్లు చూపిన ఫోటోలను మీడియాకు చూపించారు. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దాణా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదికే స్పష్టం చేస్తోందన్నారు.
అలాగే అప్పటి విజిలెన్స్ నివేదికను, అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. ప్రతీ రోజూ అసత్య ఆరోపణలు, పచ్చి అపద్దాలతో టీటీడీ సంస్థ మీద బురద చల్లుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు. వ్యక్తిగతంగా నా మీద ఏమైనా ఉంటే ఆరోపించుకో కానీ దైవ సంస్థ మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. టీటీడీ గోశాలలో గోవుల సహజ మరణాలను ఆయన సొంత రాజకీయాల కోసం వాడుకోవాలని కుట్రలు చేస్తే వేంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఊరుకోరని, ఇతర మతాల విశ్వాసాల మీద అసత్య ప్రచారాలను ఇలాగే చేయగలవా అని, హిందువులపై ఎందుకంత ద్వేషమని ఆయన ప్రశ్నించారు.
కరుణాకర్ రెడ్డికి దేవుడు అంటే భయం లేదని, భక్తి లేకనే రోజూ ఏదో ఒక విధంగా అబద్దాలను మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టీటీడీ సంస్థపై ఏదైనా నిజాలు చెబితే సరిదిద్దుకుంటాం.. కానీ బురద చల్లితే ఊరుకోని చెప్పారు. ఇక తాను చైర్మన్ అయ్యాక గత పాలనలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై ఆరా తీస్తుంటే అడుగడుగునా కమిషన్ల భాగోతమమేనని, కాంట్రాక్టర్లు అందరూ వచ్చి మేము కమీషన్లు ఇచ్చాం.. మా సంగతేంటని అడుగుతున్నారని అన్నారు. టీటీడీ కమీషన్ల చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి అపకీర్తి మూటగట్టుకున్నారని విమర్శించారు. తాను చైర్మన్ అయ్యాక ఒక రూపాయి కూడా అవినీతి మరక లేకుండా సేవలు అందిస్తున్నానని బీఆర్ నాయుడు వెల్లడించారు.