Janasenaతో పొత్తుపై Bjp నేత విష్ణువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై జనసేన, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని ఆయన తెలిపారు...
- వచ్చే ఎన్నికల్లో ఓ పార్టీ జెండా పీకేయడం ఖాయం
- ఫిరాయింపులు ప్రోత్సహిస్తే పుట్టగతులు లేకుండా చేస్తాం
- టీడీపీ, వైసీపీ కేన్సర్ వంటివి
- జనసేనతోనే మా పొత్తు
- - బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై జనసేన, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని ఆయన తెలిపారు. పవన్ సైతం క్లియర్‌గా ఉన్నట్లు విష్ణువర్థన్ రెడ్డి చెప్పారు. 'బీజేపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళుతున్నాం. మా ఇద్దరి కలయికలను చెడగొట్టడానికి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. 3 దశాబ్దాలు రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల పొత్తులు పెట్టుకుని బీజేపీ నష్టపోయింది. పక్క రాష్ట్రాల్లో జెండా తీసేసినా వైసీపీ, టీడీపీల్లో ఒకటి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనుమరుగైపోయేలా బీజేపీ రాజకీయాలు చేస్తోంది. ఇప్పుడు ప్రజల మద్దతు పొందుతున్న చిన్న పార్టీలను బలిచేయాలని చూస్తున్నారు. చిరంజీవి పార్టీని అలాగే ముంచేశారు. బీజేపీ అవినీతి పార్టీలతో కలవదు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. మా నాయకులపై స్పష్టమైన అభిప్రాయం ఉంది. వేరే పార్టీల నుంచి టీడీపీ, వైసీపీల్లోకి వెళ్తే పునీతులు. బీజేపీలోకి వస్తే భూతద్దంలో పెట్టి చూపిస్తారా?.' అని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నుంచి ఫిరాయింపును ప్రోత్సహించే పార్టీలకు తగిన బుద్దిచెబుతామని విష్ణువర్థన్ రెడ్డి హెచ్చరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విష్ణువర్ధనరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదలను ఓర్చుకోలేని ప్రాంతీయ పార్టీలు తమ చేతుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లుడు కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన మండిపడ్డారు. భీమవరం కార్యవర్గ సమావేశానికి హాజరుకాని నాయకులు పార్టీ ఫిరాయిస్తున్నారని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంన చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కూడా దుష్ప్రచారానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బీజేపీ, జనసేనల మధ్య పొత్తులపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులు, ప్రాంతీయ పార్టీల వైఖరిని విష్ణువర్థన్ రెడ్డి ఖండించారు. టీడీపీ, వైసీపీ కుటుంబ, అవినీతి పార్టీలు, కేన్సర్ వంటివని, ఆ రెండు పార్టీలను వదిలించుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని విమర్శించారు. మార్చిలో ప్రజాపోరు `2 కార్యక్రమం ద్వారా 50 లక్షల ఇళ్లను సందర్శించి ప్రజా వ్యతిరేకవిధానాలపై ప్రజలను చైతన్యవంతం చేసి 10 వేల ఛార్జిషీట్లు వేస్తామన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామిక జీవో నెంబరు 1 తీసుకువచ్చిందని విమర్శించారు. 2024లో బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రధాని నరేంద్రమోడీని చేసుకుని ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ పార్టీలను సమూలంగా తొలగించివేయాలని, బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్‌ను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని విష్ణువర్థన్ రెడ్డి ప్రజలను కోరారు.
అనైతిక రాజకీయాలకు పాల్పడితే బుద్ధి చెప్తాం
బీజేపీకి చెందిన కొందరు నాయకులను చేర్చుకునేందుకు టీడీపీ, వైసీపీలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ జోలికొచ్చిన పార్టీలు ఈ దేశంలో కాలగర్భంలో కలిసిపోయాయని హెచ్చరించారు. బీజేపీ శక్తిసామర్ధ్యాలను గుర్తించారు కాబట్టే రాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండా మద్దతునిచ్చారని... ప్రసార సాధనాలను గుప్పిట్లో పెట్టుకుని విషప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు. పోలవరం, ప్రత్యేకహోదా అంశాలపై బీజేపీని నిందించే ఊసరవెల్లి వంటి నాయకులు ఈ సమస్యకు కారణమైన టీడీపీ, వైసీపీలను ఎందుకు నిలదీయరు?. బస్సులు, విహారయాత్రలు ఇప్పుడే గుర్తుకువస్తాయా?. చేతనైతే ఈ రెండు పార్టీలతో చర్చ నిర్వహించాలి. కేసులు, ఆస్తుల కోసం కేసీఆర్‌కు భయపడే నేతలు బీజేపీని ప్రభావితం చేయలేరు. జగన్, షర్మిల, చంద్రబాబు, లోకేష్ తప్ప పాదయాత్రలు చేయడానికి ఆ పార్టీలో నేతలే లేరా?. ఎందుకు వారసులే చేస్తున్నారు.' అని విష్ణువర్థన్ రెడ్డి నిలదీశారు.