Minister Nimmala:ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం పొందిన ప్రజా నాయకుడు బడేటి బుజ్జి

స్థానిక నరసింహరావుపేటలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏలూరు మాజీ శాసనసభ్యులు దివంగత బడేటి వెంకటరామయ్య(బుజ్జి) కాంస్య విగ్రహాన్ని

Update: 2024-12-26 11:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: స్థానిక నరసింహరావుపేటలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏలూరు మాజీ శాసనసభ్యులు దివంగత బడేటి వెంకటరామయ్య(బుజ్జి) కాంస్య విగ్రహాన్ని గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు’ అన్న ఎన్‌టి.రామారావు ఆశయాలకు అనుగుణంగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి బడేటి బుజ్జి కృషి చేశారన్నారు.

టీడీపీ ప్రభుత్వంలో అనేక పదవులు చేపట్టి బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసి ఏలూరు ప్రాంత ప్రజల మనస్సుల్లో బడేటి బుజ్జి సుస్థిర స్థానం పొందారన్నారు. ఏదైనా ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడే వ్యక్తి బడేటి బుజ్జి అని, 2014-19 సమయంలో బడేటి బుజ్జితో సహచర ఎమ్మెల్యేగా పని చేశానన్నారు. నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) దృష్టికి తీసుకువెళ్లి సాధించుకునే వారన్నారు. బడేటి బుజ్జి భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులలో ఎప్పటికీ నిలిచే ఉంటారని, వారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


Similar News