Ap News: బదిలీల్లో అడ్డదారులు.. ఇదేంటి గురువులూ!
"నివాసం ఒకచోట. కొలువు ఇంకోచోట. ఉద్యోగం వచ్చినప్పుడు ఎక్కడకైనా వెళ్లాల్సిందే. ఎక్కడో జిల్లా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్నాం. బదిలీల్లోనైనా మాపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు కాస్త దగ్గరగా వస్తామని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాం. ..
దిశ, ఏపీ బ్యూరో: "నివాసం ఒకచోట. కొలువు ఇంకోచోట. ఉద్యోగం వచ్చినప్పుడు ఎక్కడకైనా వెళ్లాల్సిందే. ఎక్కడో జిల్లా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్నాం. బదిలీల్లోనైనా మాపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు కాస్త దగ్గరగా వస్తామని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాం. తీరా చూస్తే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి అనర్హులు దరఖాస్తు చేస్తున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున పైరవీలు సాగుతున్నాయి. ఆమ్యామ్యాలతో చక్కబెట్టుకుంటున్నారు. ఇక పారదర్శకత ఎక్కడ ఉంది సార్!" అంటూ ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేటగిరీ కింద వచ్చిన దరఖాస్తులను అధికారులు నిక్కచ్చిగా పరిశీలించాలని కోరుతున్నాడు.
ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో గౌరవ స్థానం ఉంది. పని చేస్తున్న ఊరికి, పాఠాలు చెబుతున్న విద్యార్థులకు మార్గదర్శకులు ఉపాధ్యాయులే. గురువుల స్థానంలో ఉన్నవాళ్లే బదిలీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధ్యాయుల కౌన్సిలింగ్‌లో భాగంగా ప్రకాశం జిల్లాలో కొన్ని అవకతవకలకు ఆస్కారమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద బదిలీల కోసం సుమారు వంద దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అందులో మూడోవంతు అనర్హులున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అనర్హులు ప్రిఫరెన్షయల్ కేటగిరీకి గండికొడుతున్నారనేది అధికార యంత్రాంగం పరిశీలించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జీఓ నెం.187 ప్రకారం ఉపాధ్యాయ బదిలీల్లో పారదర్శత కోసం ప్రభుత్వం పలు మార్గదర్శకాలు సూచించింది. అవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పరిశీలించడానికి ఓ అబ్జర్వరును కూడా నియమించింది. ఇందుకు సంబంధించి కౌన్సిలింగ్ కోసం డీఈఓ కార్యాలయంలో కసరత్తు జరుగుతుంది. ఆ జీఓలోని సెక్షన్ 8 ప్రకారం జనరల్ కౌన్సిలింగ్‌తో పాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీలోని సెక్షన్ 'ఏ' కిందకు అంధులు, శారీరక వికలాంగులు వస్తారు. వీళ్లు కోరుకున్న చోటకు బదిలీ చేయాలి.
అలాగే సెక్షన్ 'బి' పరిధిలోకి మానసిక వికలాగులైన పిల్లల తలిదండ్రులు, సెక్షన్ 'సి' కిందకు కేన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ/అవయవ మార్పు సమస్యలతో ఇబ్బంది పడే ఉపాధ్యాయులు వస్తారు. ఇవే సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయుల పిల్లలు, భార్య, భర్త, ఆధారపడిన తలిదండ్రులు దీని పరిధిలోనే పరిగణిస్తారు. సెక్షన్ 'డి' కిందకు వితంతువులైన ఉపాధ్యాయులు, 'ఈ' పరిధిలో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్న మహిళా ఉపాధ్యాయులుంటారు. 'ఎఫ్' కిందకు డిఫెన్స్సర్వీసుల్లో పని చేస్తున్న వారి భార్యలు వస్తారు. సెక్షన్ 'జి' కింద డిఫెన్స్ సర్వీసుల్లో పని చేసిన భార్యలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఈ ఆర్డర్‌ను ఫాలో అవ్వాల్సిందే.
సెక్షన్ 'సి'లోనే ఉల్లంఘనకు అవకాశం
సెక్షన్ 'సి'లో భాగంగా కొందరు ఉపాధ్యాయులు అవకతవకలతో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ సెక్షన్ ప్రకారం ఆధారపడి ఉన్న తలిదండ్రులు, పిల్లలకు ఉపాధ్యాయులు డిపెండెంట్‌గా హెల్త్ కార్డులో ఉండాలి. ప్రభుత్వ, ఫ్యామిలీ పెన్షన్ ఉన్న వాళ్ల పేర్లు ఉపాధ్యాయుల హెల్త్ కార్డులో ఉండవు. ఉండే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి వారికి పెన్షన్ ద్వారా ఆదాయం ఉంది కాబట్టి ఆధారపడినట్టు కాదు. ఈ సెక్షన్ కింద రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసినట్లు సమాచారం. అందులో సుమారు మూడింట ఒకవంతు దరఖాస్తులకు సంబంధించి తలిదండ్రులు ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వాళ్లు, హెల్త్ కార్డుల్లో పేర్లు లేని వాళ్లేనని తెలుస్తోంది. అంతమంది అడ్డదారుల్లో వాళ్లకు కావాల్సిన చోటకు బదిలీ అయితే మిగతావాళ్లు ఏం కావాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు లోతుగా పరిశీలించాలని, అడ్డదారిలో దరఖాస్తు చేసుకున్న వాళ్లను కౌన్సిలింగ్‌కు అనర్హులుగా ప్రకటించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ALSO READ : Big Breaking: కేంద్రపాలిత ప్రాంతంగా విశాఖ?